ఆ ఆడియో క్లిప్ నకిలీది.. మహేశ్ గౌడ్ నాకు తమ్ముడితో సమానం: క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్ అలీ వివరణ

by Gantepaka Srikanth |

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ స్పందించారు.

ఆ ఆడియో క్లిప్ నకిలీది.. మహేశ్ గౌడ్ నాకు తమ్ముడితో సమానం: క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్ అలీ వివరణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పార్టీ క్రమశిక్షణా కమిటీ పంపిన లేఖకు ఆయన ఘాటైన వివరణ ఇచ్చారు. ఆ ఆడియో క్లిప్ పూర్తిగా నకిలీదని, ఎవరో కావాలనే సృష్టించిన కల్పితమైన అంశమని ఆయన స్పష్టం చేశారు. "నాపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. క్రమశిక్షణ కమీటీ ఈ విషయమై నన్ను వివరణ కోరడానికి ముందే.. నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై నేను పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయించాను" అని వెల్లడించారు. తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పార్టీని బలహీనపరిచేందుకే ఈ కుట్ర..

సమాజంలో, పార్టీలో తనకున్న ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనే ఒక పక్కా ప్రణాళికతోనే కొందరు ఈ తరహా కుట్రలకు తెరలేపారని షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను పార్టీ శ్రేణులు నమ్మవద్దని, కుట్రదారుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను త్వరలోనే బయటపెడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహేశ్ కుమార్ గౌడ్ నాకు సోదరుడు లాంటి వాడని అన్నారు. ‘ఎక్కడా మహేశ్ గౌడ్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. మా ఇద్దరి మధ్య దూరం పెంచేందుకు కుట్ర జరుగుతోంది. 45 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాను. పార్టీకి నష్టం జరిగే పని ప్రాణం పోయినా చేయను’ అని షబ్బీర్ అని చెప్పుకొచ్చారు.

Next Story