ఏపీలో దంచికొడుతున్న భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఏపీలో దంచికొడుతున్న భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వానలు దంచికొడుతుండటంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. విజయవాడ (Vijayawada) సీటీ, పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇన్‌ఫ్లో రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు బ్యారేజీకి చెందిన 4 గేట్లను పైకి ఎత్తారు. బ్యారేజీకి వస్తున్న అదనపు వరద నీటిని దిగువన ఉన్న సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఉత్తరాంధ్రలోనూ వానల జోరు..

మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ వర్షాల ఉధృతి కొనసాగుతోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లోని పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వాన దంచికొడుతుండటంతో రహదారులు జలమయమయ్యాయి, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలే కాకుండా, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ ఆకాశం దట్టమైన మేఘాలతో మేఘావృతమై ఉంది. రాబోయే కొన్ని గంటల్లో మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలకు అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department officials) హెచ్చరికలు జారీ చేశారు.

Next Story