సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద ఉద్రిక్తత.. కానిస్టేబుల్, హోంగార్డుకు తీవ్ర గాయాలు

by Jakkula.Mamatha |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద ఉద్రిక్తత.. కానిస్టేబుల్, హోంగార్డుకు తీవ్ర గాయాలు
X

దిశ,​బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తుల పై ఇసుక నిర్వాహకులు దాడికి తెగబడటం, ఆపై శాంతిభద్రతలను కాపాడేందుకు వెళ్లిన పోలీస్ సిబ్బందిని లారీతో ఢీకొట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు తీవ్రంగా గాయపడ్డారు.

గ్రామస్తులపై ఇసుక నిర్వాహకుల దాడి

​స్థానికుల కథనం ప్రకారం.. సోంపల్లి ఇసుక ర్యాంపు నుండి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని భావించిన సోంపల్లి గ్రామస్తులు ఆదివారం ఇసుక లారీలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇసుక నిర్వాహకులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి లోనైన ఇసుక నిర్వాహకులు స్థానిక గ్రామస్తుల పై భౌతిక దాడికి తెగబడ్డారు. దీంతో బాధితులు న్యాయం కోసం వెంటనే బూర్గంపాడు పోలీసులను ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన బ్లూకోల్ట్స్.. లారీతో ఢీకొట్టిన డ్రైవర్

​సోంపల్లి ఇసుక ర్యాంపు దగ్గర గ్రామస్తులు లారీలను అడ్డుకుంటున్నారనే సమాచారం అందుకున్న వెంటనే బూర్గంపాడు పోలీస్ స్టేషన్ కు చెందిన బ్లూకోల్ట్స్ సిబ్బంది కానిస్టేబుల్ మంగీలాల్, హోంగార్డు శ్రీనివాసరావు వెంటనే బైకుపై సోంపల్లి ఇసుక ర్యాంపునకు చేరుకున్నారు. అక్కడ ఘర్షణ పడుతున్న ఉభయ పక్షాలకు, సోంపల్లి గ్రామస్తులకు నచ్చజెప్పి, శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చారు. అనంతరం లారీలను అక్కడి నుంచి పంపిస్తూ, వారు తిరిగి పోలీస్ స్టేషన్ కు ప్రయాణమయ్యారు.

​ఈ క్రమంలో దోమల వాగు నుంచి బ్లూకోల్ట్స్ సిబ్బంది తమ బైకుపై బయటకు వస్తుండగా, వెనుక నుండి ఏపీ16 టీజె 3569 నెంబర్ గల ఇసుక లారీని డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ముందున్న పోలీస్ బైకును బలంగా ఢీ కొట్టాడు. ప్రమాదంలో బైకుపై ఉన్న కానిస్టేబుల్ మంగీలాల్, హోంగార్డు శ్రీనివాసరావు కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పోలీసులు ప్రయాణిస్తున్న హీరో గ్లామర్ మోటార్ సైకిల్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అలాగే విధి నిర్వహణలో భాగంగా వారి వద్ద ఉన్న రెండు ప్రభుత్వ ట్యాబ్‌లు కూడా ఈ ఘటనలో పూర్తిగా ధ్వంసమయ్యాయి.

భద్రాచలం ఆసుపత్రికి తరలింపు.. కేసు నమోదు

​ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తోటి సిబ్బంది, స్థానికులు తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ మంగీలాల్,హోంగార్డు శ్రీనివాసరావులను తక్షణ చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు, భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ మొబైల్ వాహనంలో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఈ ఉదంతంపై బూర్గంపాడు సబ్ ఇన్స్పెక్టర్ మేడ ప్రసాద్ స్పందిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించి, ప్రాణాంతకంగా లారీని నడిపిన డ్రైవర్ పై, ఇసుక నిర్వాహకులపై చట్టపరమైన నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశామని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని స్పష్టం చేశారు. బాధ్యులు ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు.

Next Story