- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరు మిర్చికి చైనా బ్రేక్.. మూడు కంటైనర్ల సరుకు తిరస్కరణ
గుంటూరు మిర్చి రైతలకు డ్రాగన్ కంట్రీ దిమ్మతిరిగే షాకిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ అయిన గుంటూరుకు చెందిన మిర్చి రైతులకు, ఎగుమతిదారులకు పొరుగు దేశం చైనా ఊహించని షాకిచ్చింది. గుంటూరు నుంచి ఎక్స్‌పోర్ట్ అయిన 3 కంటైనర్ల మిర్చిని చైనా మార్కెటింగ్ శాఖ అధికారులు తిరస్కరించి వెనక్కి పంపిచారు. ఈ పరిణామం స్థానిక మిర్చి వ్యాపారుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మరికొన్ని కంటైనర్లకు కూడా తిరిగి స్వదేశానికి పంపే అవకాశాలు ఉన్నాయి.
ల్యాబ్ టెస్టుల్లో తేలిన చేదు నిజం
చైనా నిబంధనల ప్రకారం సరిహద్దుకు చేరుకున్న మిర్చి నిల్వలను అక్కడి మార్కెటింగ్, కస్టమ్స్ శాఖ అధికారులు అనుమానం వచ్చి ల్యాబ్ టెస్ట్‌లకు పంపించారు. ఆ పరీక్షల్లో మిర్చిలో ప్రమాదకరమైన పురుగుల మందుల అవశేషాలు (Chemical Residues) ఉన్నట్లు తేలిందని చైనా అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా, మానవ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే మిథామిడోపాస్ (Methamidophos) అనే రసాయనం అనుమతించదగిన స్థాయి కంటే చాలా అధికంగా ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టుల్లో స్పష్టమైందని, అందుకే ఈ సరుకును తిరస్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు. దీంతో రూ.లక్షలు వెచ్చించి సాగు చేసి ఎగుమతి చేసిన సరుకు ఇలా సరిహద్దుల నుంచి వెనక్కి వచ్చేయడంతో అటు వ్యాపారులు, ఇటు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. డబుల్ రవాణా ఛార్జీలు భరించలేక, సరుకు అమ్ముడుపోక ఎగుమతిదారులు తలలు పట్టుకుంటున్నారు.
ఆ రసాయనం బ్యాన్ చేయాలని డిమాండ్
మరోవైపు మిర్చి రైతులు, రైతు సంఘాలు ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మిరప పంటపై తీవ్ర ప్రభావం చూపే, నిషేధిత జాబితాలో ఉండే మిథామిడోపాస్ లాంటి రసాయనాలు కలిగిన పురుగుల మందులను మార్కెట్లో దొరకకుండా పూర్తిగా నిషేధించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నకిలీ, నాణ్యత లేని పురుగుల మందుల వల్లే అంతర్జాతీయ మార్కెట్లో గుంటూరు మిర్చి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర మార్కెట్ నిపుణులు రైతులు పంట సాగు సమయంలో పురుగుమందుల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని, అధికారులు నాణ్యతా ప్రమాణాలపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.






