నాలుగు జిల్లాల కూడలిగా హుస్నాబాద్‌ అభివృద్ధి..

by Taduka Kalyani |

కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, జనగామ వంటి నాలుగు ప్రధాన జిల్లాల సరిహద్దుల కూడలిగా, ఒక కీలకమైన జంక్షన్‌గా ఉన్న హుస్నాబాద్‌ దశాబ్దాలుగా తీవ్ర వెనుకబాటుతనానికి గురైంది.

నాలుగు జిల్లాల కూడలిగా హుస్నాబాద్‌ అభివృద్ధి..
X

దిశ, హుస్నాబాద్: కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, జనగామ వంటి నాలుగు ప్రధాన జిల్లాల సరిహద్దుల కూడలిగా, ఒక కీలకమైన జంక్షన్‌గా ఉన్న హుస్నాబాద్‌ దశాబ్దాలుగా తీవ్ర వెనుకబాటుతనానికి గురైంది. శాశ్వత సాగునీటి వనరులు లేక, పారిశ్రామికంగా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇక్కడి యువత, రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, హుస్నాబాద్ నియోజకవర్గం ఇప్పుడు సరికొత్త ప్రగతి పథంలో దూసుకుపోతోంది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ, పట్టుదలతో నియోజకవర్గ రూపురేఖలు మారిపోతున్నాయి. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతాన్ని ఏకంగా జిల్లా కేంద్రాలకు దీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘పొన్నం మార్క్’ పాలన క్షేత్రస్థాయిలో సాగుతోంది. నియోజకవర్గంలో వందలాది కోట్ల రూపాయల నిధులతో విద్య, వైద్య, రవాణా, పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో సరికొత్త ప్రాజెక్టులు ఆచరణాత్మక రూపం దాల్చుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా తమ సొంత ప్రాంతంలో మార్పు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సామాన్య ప్రజల ఆకాంక్షలు నేడు నెరవేరుతున్నాయి. నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యాన్ని స్థానికంగానే అందించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ విప్లవాత్మక అడుగులు వేశారు. గతంలో అరకొర వసతులతో ఉన్న వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ. 82 కోట్ల భారీ వ్యయంతో 250 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ అత్యాధునిక ఆసుపత్రి భవన నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో శరవేగంగా సాగుతున్నాయి. దీనికి తోడు ఇక్కడికి మంజూరైన పీజీ మెడికల్ కాలేజీ తో హుస్నాబాద్ వైద్య హబ్‌గా మారబోతోంది. భవిష్యత్తులో ఈ భారీ వైద్య ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే, స్థానిక పేద ప్రజలు అత్యవసర వైద్యావసరాల కోసం కరీంనగర్, హనుమకొండ లేదా హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవస్థలు, ఆర్థిక భారాలు పూర్తిగా తప్పనున్నాయి.

36 ఎకరాల విస్తీర్ణంలో


హుస్నాబాద్ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను చెంతకే చేర్చేందుకు మంజూరైన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణ పనులు కూడా ఊపందుకున్నాయి. విద్యార్థులకు అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించేలా 36 ఎకరాల విస్తీర్ణంలో, రూ. 44.12 కోట్ల భారీ నిధులతో అత్యాధునిక ల్యాబ్‌లు, తరగతి గదుల సముదాయాన్ని నిర్మిస్తున్నారు. గత సంవత్సరం ప్రారంభమైన ఇంజనీరింగ్ కాలేజీ ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో నడుస్తుండగా, త్వరలోనే శాశ్వత క్యాంపస్ అందుబాటులోకి రానుంది. ఈ విద్యా ప్రాజెక్టు పూర్తయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇండస్ట్రియల్ స్థాయి సాంకేతిక నైపుణ్యాలు స్థానికంగానే లభించనున్నాయి, తద్వారా ఉన్నత విద్యా రంగంలో హుస్నాబాద్ సరికొత్త మైలురాయిని అధిగమించనుంది. పట్టణ రవాణా రంగాన్ని బలోపేతం చేస్తూ మున్సిపాలిటీ పరిధిలో కూడా అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. హుస్నాబాద్–కొత్తపల్లి నాలుగు వరుసల రహదారి పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ రహదారి అందుబాటులోకి వస్తే నియోజకవర్గ కేంద్రం నుంచి కరీంనగర్‌కు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా కష్టాలు తీరనున్నాయి. అలాగే రామాయంపేట–ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులను మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తూ, మిగిలిపోయిన కొద్దిపాటి పనులను ముగించడానికి అధికారులను సమన్వయం చేస్తున్నారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న అత్యంత కీలకమైన హుస్నాబాద్–జనగామ రహదారి విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ రహదారి విస్తరణ పనులకు త్వరలోనే పరిపాలనా అనుమతులు సాధించి, నిధులు మంజూరు చేయించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక కసరత్తు ముమ్మరం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో అంతర్గత సీసీ రోడ్లు, అధునాతన మురుగుకాల్వల నిర్మాణం, ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లను విస్తరిస్తూ డివైడర్లు, సెంట్రల్ లైటింగ్‌తో పట్టణాన్ని సుందరంగా మారుస్తున్నారు.

‘మోడల్ ఇండస్ట్రియల్ పార్క్’


రవాణా, మౌలిక వసతులతో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు నియోజకవర్గంలోనే ఉపాధి, పారిశ్రామిక అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ‘మోడల్ ఇండస్ట్రియల్ పార్క్’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ పారిశ్రామిక పార్కుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అత్యంత వేగంగా జరుగుతోంది. అధికారులు ఇప్పటికే భూములను గుర్తించి, నిబంధనల ప్రకారం ప్రక్రియను వేగవంతం చేయడంతో పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం అవుతోంది. ఈ ఇండస్ట్రియల్ పార్క్ అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా, స్థానిక వాణిజ్య రంగాలు కూడా కొత్త ఊపును సంతరించుకోనున్నాయి. నియోజకవర్గ రైతాంగానికి జీవనాడి అయిన గౌరవెల్లి సాగునీటి ప్రాజెక్టు ప్రధాన కాలువల నిర్మాణం, భూసేకరణ సమస్యలపై కూడా మంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వరుస సమీక్షలు జరుపుతూ, భూ నిర్వాసితుల ఇబ్బందులను పరిష్కరిస్తూ కాలువల పనులకు క్షేత్రస్థాయిలో ఉరుకులు పెట్టిస్తున్నారు. గోదావరి జలాలను ప్రతి ఎకరాకు చేరవేసేలా పనులను మంత్రి స్వయంగా పర్యవేక్షిస్తుండటం విశేషం. పట్టణ పర్యాటక రంగానికి మణిహారంగా నిలిచేలా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువును భారీ నిధులతో పునరుద్ధరిస్తున్నారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా ఈ చెరువుపై రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘హృదయాకార గ్లాస్ బ్రిడ్జి’ నిర్మాణ పనులను చేపట్టారు. అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన డిజైన్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ గ్లాస్ బ్రిడ్జ్ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి, ఇది త్వరలోనే ప్రారంభం కానుంది. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు దీనికి తోడుగా జిల్లాలగడ్డ వద్ద అత్యాధునిక అర్బన్ పార్కు (పట్టణ ప్రకృతి వనం) పనులను వేగవంతం చేశారు. పచ్చని చెట్లు, వాకింగ్ ట్రాక్‌లు, పిల్లల ఆటస్థలాలతో ఈ పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. చారిత్రాత్మక మహాసముద్రం గండి ప్రాంతాన్ని కూడా పర్యాటక స్పాట్‌గా తీర్చిదిద్దే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎల్లమ్మ చెరువు గ్లాస్ బ్రిడ్జి, జిల్లాలగడ్డ పార్కు, మహాసముద్రం గండి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే హుస్నాబాద్ పట్టణ పర్యాటక రంగానికి రాష్ట్రస్థాయిలో సరికొత్త గుర్తింపు రానుంది.

మంత్రి చొరవతో అద్భుతమైన మార్పు

మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టుదలతో కూడిన నాయకత్వం, నియోజకవర్గ వికాసంపై ఆయనకున్న స్పష్టమైన దార్శనికత హుస్నాబాద్ ప్రగతిని సరికొత్త శిఖరాలకు చేరుస్తోంది. కేవలం అధికారిక ప్రకటనలకే పరిమితం కాకుండా, ప్రతీ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తూ పనుల వేగాన్ని పెంచడం ఆయన పనితీరుకు అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగిన పనుల్లో మంత్రి చొరవ వల్ల అద్భుతమైన మార్పు కనిపిస్తోందని స్థానికులు కొనియాడుతున్నారు. హుస్నాబాద్-జనగామ రహదారి విస్తరణ ప్రతిపాదనలతో పాటు కాలువల భూసేకరణ సమస్యలకు, ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణకు, జిల్లాలగడ్డ అర్బన్ పార్కు, ఎల్లమ్మ చెరువు పర్యాటక ప్రాజెక్టులకు సత్వరమే మోక్షం కలిగించేలా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్న తీరు అభినందనీయం. జిల్లా కేంద్రాలకు దీటుగా హుస్నాబాద్ రూపురేఖలు మారబోతున్న తరుణంలో, ఈ అభివృద్ధి ప్రస్థానం ఇక్కడి సామాన్యుడి జీవితాల్లో నిజమైన వెలుగులు నింపుతోంది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల స్థానిక వ్యాపార, వాణిజ్య రంగాలు కూడా కొత్త ఊపును సంతరించుకోనున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ మార్పులు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కేవలం ఒక నియోజకవర్గ కేంద్రంగానే కాకుండా, చుట్టుపక్కల వందలాది గ్రామాలకు ఒక పెద్ద ఆర్థిక, విద్యా హబ్‌గా మార్చబోతున్నాయి. ప్రజల నిండైన నిరీక్షణను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ శ్రమ, హుస్నాబాద్ చరిత్రలో 'పొన్నం మార్క్' సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Next Story