- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపే స్కూళ్లు రీఓపెన్.. బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం!
వేసవి సెలవుల అనంతరం రేపటి(సోమవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

దిశ,హైదరాబాద్ బ్యూరో: వేసవి సెలవుల అనంతరం రేపటి(సోమవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 691 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 500 ప్రాథమిక పాఠశాలలు, 9 ప్రాథమికోన్నత పాఠశాలలు, 182 ఉన్నత పాఠశాలలు ఉండగా సుమారు 1.35 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా గత విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత ఏప్రిల్ 24 వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ముందుగా ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సెలవును 14వ తేదీ వరకు పొడిగించింది.
విద్యార్థులకు గుడ్ న్యూస్..
పిల్లలు ఖాళీ కడుపుతో పాఠశాలలకు రాకూడదని తెలంగాణ ప్రభుత్వం ఈ పర్యాయం సరికొత్త మార్గదర్శకాలతో పౌష్టికాహార పథకం ప్రవేశ పెట్టింది . జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికాహారం అందించడం కోసం దీనిని అమలు చేయనుంది. పిల్లల్లో పోషకాహార లోపాన్ని పోగొట్టడం., బడికి వచ్చే పిల్లల సంఖ్యను పెంచడం, పిల్లలు ఆకలి లేకుండా చదువుపై బాగా ఏకాగ్రత పెట్టేలా చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రతిరోజూ ఉదయం బడి ప్రారంభం కావడానికి ముందే వేడివేడిగా ఈ అల్పాహారాన్ని వడ్డిస్తారు. అల్పాహారంతో పాటు వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావ అందిస్తారు. ఇందులో భాగంగా చిన్న పిల్లలకు 75 మి.లీ, పెద్ద పిల్లలకు 100 మి.లీ.చొప్పున పాలు ఇస్తారు.
మెనూ..
సోమవారం దోసె - చట్నీ లేదా సాంబార్
మంగళవారం-మిల్లెట్ (చిరుధాన్యాల) ఇడ్లీ , సాంబార్
బుధవారం-పూరీ, వెజిటబుల్ కుర్మా
గురువారం-బోండా, చట్నీ
శుక్రవారం-ఇడ్లీ, సాంబార్
శనివారం-ఉప్మా, చట్నీ లేదా సాంబార్
మొదటి దశలో జిల్లాలో 45 పాఠశాలల్లో అమలు: డీఈఓ యాదయ్య
హైదరాబాద్ జిల్లాలో అల్పాహారం పథకం అమలులో భాగంగా మొదటి విడతలో 45 ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు. పాఠశాలల పునఃప్రారంభం రోజైన సోమవారం రాజ్ భవన్ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిని ప్రారంభించనున్నారు. మన్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో అమలు చేయనున్న ఈ పథకం మొదటి దశలో 45 పాఠశాలలలో మొత్తం 12,437 విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలలో డ్రాపౌట్ శాతం తగ్గించే దిశగా మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఉదయం విద్యార్థులకు అందించే అల్పాహారం మెనూ లోని మిల్లెట్ ఇడ్లీ సాంబార్, మిక్స్డ్ వెజ్ కుర్మాతో పూరీ, చట్నీతో బోండా, ఉప్మా చట్నీ అలాగే దోస అందించడం జరుగుతుంది . అనంతరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, అలాగే నోట్ పుస్తకాలు అందించనున్నారు.






