బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, రథోత్సవం.. ట్రాఫిక్ ఆంక్షలు

by Batti.Sumithra |

బల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవస్థానంలో జూలై 21న జరిగే ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం, జూలై 22న నిర్వహించనున్న రథోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, రథోత్సవం.. ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ, ఖైరతాబాద్ : బల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవస్థానంలో జూలై 21న జరిగే ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం, జూలై 22న నిర్వహించనున్న రథోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీతో పాటు వాహనాల రాకపోకలు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున బల్కంపేట, ఎస్‌ఆర్ నగర్, సనత్‌నగర్, ఫతేనగర్, బేగంపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొనే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు వీలైనంత వరకు బల్కంపేట వైపు వెళ్లే మార్గాలను నివారించి, ప్రత్యామ్నాయ రూట్లను వినియోగించాలని సూచించారు.

ప్రధాన ట్రాఫిక్ మళ్లింపులు ఇవే..

గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ వైపు నుంచి బల్కంపేట, ఫతేనగర్ వైపు వచ్చే వాహనాలను ఎస్‌ఆర్ నగర్ ‘టీ’ జంక్షన్ నుంచి కమ్యూనిటీ హాల్ – అభిలాష టవర్స్ – బీకే గూడ క్రాస్‌రోడ్ – శ్రీరామ్‌నగర్ మార్గం మీదుగా సనత్‌నగర్ వైపు మళ్లిస్తారు.

ఫతేనగర్ ఫ్లై ఓవర్ నుంచి బల్కంపేట ఆలయం వైపు వాహనాలను అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను న్యూ బ్రిడ్జి (హైదరాబాద్ కిచెన్ మార్ట్) వద్ద నుంచి రైల్వే అండర్‌బ్రిడ్జి మీదుగా కట్టమైసమ్మ ఆలయం – బేగంపేట వైపు మళ్లిస్తారు.

గ్రీన్‌ల్యాండ్స్ – బకుల్ అపార్ట్‌మెంట్స్ – ఫుడ్ వరల్డ్ నుంచి బల్కంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఫుడ్ వరల్డ్ క్రాస్‌రోడ్డు వద్ద సోనాబాయి ఆలయం – సత్యం థియేటర్ – మైత్రీవనం మార్గం వైపు మళ్లిస్తారు.

బేగంపేట, కట్టమైసమ్మ ఆలయం వైపు నుంచి బల్కంపేటకు వచ్చే వాహనాలను అనుమతించకుండా బేగంపేట ఫ్లైఓవర్ – మాతా టెంపుల్ – సత్యం థియేటర్ – మైత్రీవనం మీదుగా గ్రీన్‌ల్యాండ్స్ వైపు పంపిస్తారు.

అదేవిధంగా, ఎస్‌ఆర్ నగర్ ‘టీ’ జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు ఉన్న బై లేన్లు, లింక్ రోడ్లను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.

భక్తులకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు..

భక్తుల సౌకర్యార్థం ఆర్ అండ్ బీ కార్యాలయం, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, డీకే రోడ్ నుంచి నేచర్ క్యూర్ హాస్పిటల్ రోడ్డులోని పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్ ప్రాంతం, ఫతేనగర్ అండర్‌బ్రిడ్జి, నేచర్ క్యూర్ హాస్పిటల్, సనత్‌నగర్ జీహెచ్‌ఎంసీ ప్లే గ్రౌండ్‌లలో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ పరిస్థితుల పై ఎప్పటికప్పుడు సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా వేదికలను అనుసరించాలని, అత్యవసర ప్రయాణ సహాయం కోసం 9010203626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), హైదరాబాద్ విజ్ఞప్తి చేశారు. పౌరులంతా ట్రాఫిక్ మళ్లింపులకు సహకరించి, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి సాఫీగా ప్రయాణించాలని సూచించారు.

Next Story