'BOSS'లకు బ్రేక్.. కోదాడలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

by Jakkula.Mamatha |

రోడ్లపై నిబంధనలు బేఖాతరు చేస్తూ ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లతో చక్కర్లు కొడుతున్న వాహనదారులపై కోదాడ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.

BOSSలకు బ్రేక్.. కోదాడలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
X

దిశ, కోదాడ: రోడ్లపై నిబంధనలు బేఖాతరు చేస్తూ ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లతో చక్కర్లు కొడుతున్న వాహనదారులపై కోదాడ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ట్రాఫిక్ ఎస్సై అంజి రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మోటారు వాహనాల చట్టానికి విరుద్ధంగా రిజిస్ట్రేషన్ నంబర్ల స్థానంలో 'BOSS', ఇతర ఫ్యాన్సీ అక్షరాలు, ఆకర్షణీయమైన డిజైన్లతో ఉన్న నెంబర్ ప్లేట్లను గుర్తించి అక్కడికక్కడే తొలగించారు. తనిఖీల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేసి, మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. వాహనాల అసలు రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా కనిపించేలా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నంబర్ ప్లేట్లు ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై అంజి రెడ్డి మాట్లాడుతూ.. వాహనాలకు ఇష్టానుసారంగా పేర్లు, హోదాలు, ఫ్యాన్సీ అక్షరాలు లేదా డిజైన్లతో నంబర్ ప్లేట్లు తయారు చేయించడం చట్టవిరుద్ధమని తెలిపారు. అలాంటి వాహనాలు రోడ్లపై కనిపిస్తే ఎలాంటి మినహాయింపులు లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరి భద్రత కోసం అమలులో ఉన్నాయని, వాటిని ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రానున్న రోజుల్లో కూడా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను గౌరవించి పోలీసులకు సహకరించాలని ఎస్సై అంజి రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story