న్యూ హెల్త్ స్కీం అమలుకు సీఎం జోక్యం చేసుకోవాలి

by Ratna Kumari |

ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రవేశపెట్టిన న్యూ హెల్త్ స్కీం అమలుకు కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు ఆటంకాలు సృష్టిస్తున్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని హెల్త్ స్కీం ట్రస్ట్ సభ్యుడు పాలకుర్తి కృష్ణమూర్తి కోరారు.

న్యూ హెల్త్ స్కీం అమలుకు సీఎం జోక్యం చేసుకోవాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రవేశపెట్టిన న్యూ హెల్త్ స్కీం అమలుకు కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు ఆటంకాలు సృష్టిస్తున్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని పథకం సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హెల్త్ స్కీం ట్రస్ట్ సభ్యుడు పాలకుర్తి కృష్ణమూర్తి కోరారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు సిర్ప హన్మాండ్లు అధ్యక్షతన నిర్వహించిన న్యూ హెల్త్ స్కీం అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా పాలకుర్తి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. కొత్త హెల్త్ స్కీం విధి విధానాలను పెన్షనర్లకు వివరించారు. నగదు రహిత వైద్యం త్వరలో అందుబాటులోకి వస్తుందని, అది ఉద్యోగులు, పెన్షనర్లందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా ఉద్యోగులు, పెన్షనర్లు తమ వేతనాల్లో నుంచి 1.5 శాతం చొప్పున చెల్లింపులు చేస్తున్నప్పటికీ జిల్లా, రాష్ట్ర స్థాయి కార్పొరేట్ ఆసుపత్రులు నగదు రహిత వైద్యం అందించేందుకు నిరాకరించడం సరికాదన్నారు. హెల్త్ స్కీం అమలు ఒక కొలిక్కి వచ్చిన వెంటనే పీఆర్సీ, పెండింగ్ డీఏల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సదస్సులో మరో ముఖ్య అతిథి, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి గడ్డం అశోక్ మాట్లాడుతూ.. సంఘం పోరాటాల ఫలితంగా పెన్షనర్ల బకాయిల చెల్లింపు తుది దశకు చేరుకుందని తెలిపారు.

ఈ నెలలో రూ.2,000 కోట్లను విడుదల చేస్తే బకాయిల్లో సింహభాగం చెల్లించినట్లేనని పేర్కొన్నారు. 2021లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇప్పటికీ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు చెల్లించలేదని, వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె. రాంమోహన్ రావు మాట్లాడుతూ, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి అమలు ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గత వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు 20 ఏళ్ల సర్వీసుకే పూర్తి పెన్షన్, 398 రోజుల వేతనంతో పనిచేసిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. ఈ సదస్సులో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎల్ నారాయణ, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, మార్కెటింగ్ కమిటీ అధ్యక్షుడు బన్సీలాల్, నాయకులు మదన్ మోహన్, దీన సుజన, అమీరుద్దీన్, ప్రసాద్ రావు, సాంబశివరావు, ప్రేమలత, ఆర్మూర్ శంకర్, బోధన్ పబ్బ మురళి, రాధాకృష్ణ, రాజేశ్వరరావు, వెంకటేష్, బట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో సిర్ప లింగయ్య పెన్షనర్ల సమస్యలపై ఆలపించిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి.

Next Story