ట్రాక్టర్‌ బోల్తా.. యువకుడి దుర్మరణం

by Ratna Kumari |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు గ్రామ శివారులో గురువారం జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు.

ట్రాక్టర్‌ బోల్తా.. యువకుడి దుర్మరణం
X

దిశ, దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు గ్రామ శివారులో గురువారం జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన అంగిరేకుల రిషికేష్‌ (28) తీవ్రంగా గాయపడగా, మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రిషికేష్‌ ట్రాక్టర్‌తో పొలం పనుల వద్దకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో పొలం నుంచి ప్రధాన రహదారిపైకి ట్రాక్టర్‌ను ఎక్కించే సమయంలో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్రాక్టర్‌ కింద చిక్కుకున్న అతడికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాక్టర్‌ కింద నుంచి రిషికేష్‌ను బయటకు తీసి ముందుగా సమీప ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రిషికేష్‌కు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొద్దిరోజులకే అతడు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి ఇంటి వద్ద విషాద వాతావరణం నెలకొనగా, యువకుడి అకాల మరణం బైరాగులపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది.

Next Story