సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

by Naga Rani Yarlagadda |

సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, విద్యార్థుల సంక్షేమం, హాస్టళ్ల అభివృద్ధి, స్వయం ఉపాధి పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో : సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, విద్యార్థుల సంక్షేమం, హాస్టళ్ల అభివృద్ధి, స్వయం ఉపాధి పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ సమీక్షలో పాల్గొన్నారు. సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలు, హాస్టళ్ల మరమ్మతు పనులను నెల రోజుల్లోపు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 2023 నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.7.5 కోట్ల మరమ్మతు బిల్లులను ప్రాధాన్యతతో క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ప్రైవేట్ భవనాల్లో ఉన్న విద్యార్థులను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు తరలించే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.

బిల్లుల చెల్లింపులో జాప్యం వద్దు..

హాస్టళ్ల రెంట్, డైట్, కాస్మెటిక్ ఛార్జీలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆర్థిక శాఖకు పంపాలని కార్యదర్శులను భట్టి విక్రమార్క ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన బిల్లుల విషయంలో ఏమాత్రం జాప్యం జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామని గుర్తు చేశారు. బహుళ అంతస్తుల అంబేద్కర్ భవన నిర్మాణం పూర్తి చేసి, 2027 ఏప్రిల్ 14న ప్రారంభించేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసి, పోటీ పరీక్షల్లో విజయశాతాన్ని పెంచాలన్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో భాగంగా.. అన్ని స్వయం ఉపాధి పథకాలను అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈవీ ద్విచక్ర వాహనాల పథకంపై పూర్తి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, అనిత రామచంద్రన్, విజయేంద్ర బొయి, శైలజ తదితరులు పాల్గొన్నారు.

Next Story