కర్ణాటక ప్రాజెక్టులు తెలంగాణకు మరణశాసనాలు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Batti.Sumithra |

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృష్ణ, తుంగభద్ర నదులపై నిర్మిస్తున్న బ్యారేజీలు, రిజర్వాయర్ల వల్ల తెలంగాణ రాష్ట్రానికి మరణశాసనం రాసినట్లేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

కర్ణాటక ప్రాజెక్టులు తెలంగాణకు మరణశాసనాలు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృష్ణ, తుంగభద్ర నదులపై నిర్మిస్తున్న బ్యారేజీలు, రిజర్వాయర్ల వల్ల తెలంగాణ రాష్ట్రానికి మరణశాసనం రాసినట్లేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రత్యేకంగా ఉమ్మడి పాలమూరు జిల్లా మళ్లీ ఎడారిగా మారే దుస్థితి నెలకొంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒకటై తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించేలా సాగునీటిని తరలించేందుకు బ్యారేజీలు, ఎత్తిపోతల పథకాలను చేపట్టాయని ఆయన ఆరోపించారు. కర్ణాటక నావలి వద్ద 50 టీఎంసీల బ్యారేజీ పనులను ప్రారంభించిందని, ఆర్డీఎస్‌కు 100 మీటర్ల దూరంలో బ్యారేజీ నిర్మిస్తున్నా మన పాలకులకు కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తుంగభద్ర నది పొడవునా రోడ్లు, వంతెనలు, రిజర్వాయర్లు నిర్మిస్తూ నీటిని నిల్వ చేసుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే పెద్ద ఎత్తున నీటిని దోపిడీ చేసుకోవడంతో పాటు ఇప్పుడు గుండ్రేవుల వద్ద 20 టీఎంసీల రిజర్వాయర్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని మాజీ మంత్రి తెలిపారు. ఈ కారణంగా శ్రీశైలం, తుమ్మిళ్లకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని, పాలమూరు ప్రాజెక్టులన్నీ నీళ్లు లేక మళ్లీ ఎడారిగా మారే పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పారు. తెలంగాణ రైతాంగాన్ని ఈ ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. కర్ణాటక మంత్రి వచ్చి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తే కొంతమంది ఎమ్మెల్యేలు కర్ణాటక ప్రతిపాదనలను వ్యతిరేకించినట్లు, మరికొందరు మౌనంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. ఇప్పుడు నష్టం జరుగుతోందని, తెలంగాణ, పాలమూరు బిడ్డలుగా మేలుకోకపోతే తీవ్రంగా నష్టపోతామని మాజీ మంత్రి హెచ్చరించారు.

కర్ణాటక పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి సంగతి అటు ఉంచితే, కనీసం నీటిపారుదల శాఖ మంత్రి అయినా మనకు నష్టం జరుగుతున్న దృశ్యాలు కంటికి కనిపించలేదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారిని ఇక్కడ సలహాదారుగా నియమించుకోవడం వల్ల ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్నాడు తప్ప, తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసే నిర్ణయాలు తీసుకోవడం లేదని అన్నారు. ఆర్డీఎస్ వద్ద ఇంజినీరింగ్ అధికారులను ఆంధ్ర అధికారులు, పోలీసులు బెదిరిస్తున్నారని, మన రాష్ట్రంలో మన గడ్డపై విధులు నిర్వహిస్తున్న అధికారులే బెదిరింపులకు గురయ్యే పరిస్థితులు ఈ ప్రభుత్వంలో నెలకొన్నాయని మాజీ మంత్రి విమర్శించారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటి తరలింపు యత్నాలను అడ్డుకోకుంటే తెలంగాణ పోరాట స్ఫూర్తితో అడ్డుకోవడానికి పోరాటాలు చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

కొడంగల్ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం లేదు: మాజీ ఎమ్మెల్యే చిట్టెం

కొడంగల్ ఎత్తిపోతల పథకం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని మూడు మండలాలకు నష్టం చేకూరుస్తూ కొడంగల్ నియోజకవర్గానికి నీటిని తరలించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పైప్‌లైన్‌ను కేవలం ఒక మీటరు లోతులో వేస్తున్నారని, భవిష్యత్తులో ఆ పైప్‌లైన్ పగిలిపోయి ప్రమాదకరంగా మారడం ఖాయమని తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని, ఆ ఇసుక రవాణాను అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు ఈశ్వరయ్య, రమేష్ నాయక్, బీఆర్‌ఎస్ నాయకులు రాజేశ్వర్ గౌడ్, నరసింహులు, శివరాజ్, శ్రీశైలం, అనంత రెడ్డి, బాలరాజు, చెన్నయ్య, గిరిధర్ రెడ్డి, కృష్ణయ్య గౌడ్, జంబులయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story