- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాల, కరీంనగర్‌లో ఏసీబీ దాడులు.. భారీగా నగదు, ప్లాట్లు గుర్తింపు
ఏసీబీ తాజాగా కరీంనగర్ జిల్లాలో మరో బడా అక్రమార్కుడి గుట్టు రట్టు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కరీంనగర్ అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాము నివాసాలపై ఏసీబీ అధికారులు గురువారం ముమ్మర సోదాలు నిర్వహించారు.

దిశ,తెలంగాణ బ్యూరో: ఏసీబీ తాజాగా కరీంనగర్ జిల్లాలో మరో బడా అక్రమార్కుడి గుట్టు రట్టు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కరీంనగర్ అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాము నివాసాలపై ఏసీబీ అధికారులు గురువారం ముమ్మర సోదాలు నిర్వహించారు. గతంలో వేములవాడ ఎస్.హెచ్.ఓ గా పనిచేసిన కాలం నుంచి ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ ఈ పంజా విసిరింది. ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో సుమారు రూ.87.44 లక్షల విలువైన డాక్యుమెంట్ విలువ ప్రకారం స్థిర, చరాస్తులను అధికారులు గుర్తించారు.
ఇంట్లోనే లక్షల నగదు..
జగిత్యాలలోని భవానీ నగర్‌లో ఇన్‌స్పెక్టర్ రాము నివసిస్తున్న అద్దె ఇంట్లో ఏసీబీ బృందాలు సోదాలు చేయగా.. ఏకంగా రూ.20,67,850 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు బ్యాంకు ఖాతాల వివరాలను పరిశీలించగా.. ఇన్‌స్పెక్టర్ రాము పేరు మీద రూ.29,88,317, ఆయన తండ్రి ఖాతాలో రూ.16,77,978 బ్యాంకు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లోని ఇతర ఖరీదైన వస్తువుల విలువ సుమారు రూ.11,97,000 ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. చరాస్తులతో పాటు ఇన్‌స్పెక్టర్ రాము వివిధ ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినట్లు పత్రాల ద్వారా తేలింది. కరీంనగర్ టౌన్‌లో ఒక ఓపెన్ ప్లాట్ ప్రభుత్వ డాక్యుమెంట్ విలువ రూ. 6,05,000, సిరిసిల్లలో ఒక వాణిజ్య స్థలం ప్రభుత్వ డాక్యుమెంట్ విలువ రూ. 2,18,484 ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఏసీబీ ప్రకటించిన రూ.87.44 లక్షల మొత్తం కేవలం ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఉన్న విలువ మాత్రమేనని.. బహిరంగ మార్కెట్లో వీటి విలువ చాలా రెట్లు అధికంగా, అంటే కోట్లలోనే ఉంటుందని దర్యాప్తు సంస్థ భావిస్తోంది.
కొనసాగుతున్న దర్యాప్తు..
నిజానికి, నిందితుడైన అధికారి రాముపై ఈ ఏడాది మార్చి 17నే క్రిమినల్ మిస్‌కాండక్ట్ కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి ఆయన ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచిన అధికారులు.. పక్కా ఆధారాలతో ఈ దాడులు నిర్వహించారు. తన అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని మద్యం సిండికేట్ల నుంచి లేదా ఇతర అక్రమ మార్గాల్లో ఈ సంపదను కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, మరిన్ని బినామీ ఆస్తులు లేదా ఇతర బ్యాంకు లాకర్ల వివరాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.






