తెలంగాణ ఉన్నత విద్యా మండలిలో భావోద్వేగ వీడ్కోలు

by Ajay Maddhiboyina |

డిగ్రీ విద్యార్థుల కోసం పాఠ్యాంశాల పునర్వ్యవస్థీకరణ, నూతన విద్యా కార్యక్రమాల ప్రవేశపెట్టడంలో టీజీసీహెచ్‌ఈ వైస్‌ చైర్మన్-2 ప్రొఫెసర్ ఎస్.కె. మహమూద్ చూపిన పట్టుదల, అంకితభావం అభినందనీయమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ ఉన్నత విద్యా మండలిలో భావోద్వేగ వీడ్కోలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీ విద్యార్థుల కోసం పాఠ్యాంశాల పునర్వ్యవస్థీకరణ, నూతన విద్యా కార్యక్రమాల ప్రవేశపెట్టడంలో టీజీసీహెచ్‌ఈ వైస్‌ చైర్మన్-2 ప్రొఫెసర్ ఎస్.కె. మహమూద్ చూపిన పట్టుదల, అంకితభావం అభినందనీయమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్-2 ప్రొఫెసర్ ఎస్.కె. మహమూద్ పదవీకాలం ముగిసిన సందర్భంగా గురువారం ఆయనకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి అధికారులు, సిబ్బంది సభ్యులు ప్రొఫెసర్ మహమూద్‌తో తమ అనుబంధాన్ని, ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వైస్‌ చైర్మన్1 ప్రొఫెసర్ ఈ. పురుషోత్తం మాట్లాడుతూ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేసిన రోజుల నుంచే ప్రొఫెసర్ మహమూద్‌తో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన సమయంలో సామాజిక న్యాయం, విద్యార్థి సంక్షేమం, విద్యార్థి కేంద్రిత కార్యక్రమాల పట్ల ఆయన కనబరిచిన నిబద్ధతను కొనియాడారు. తనకు అందించిన సత్కారానికి స్పందించిన ప్రొఫెసర్ ఎస్.కె. మహమూద్, చైర్మన్‌తో పాటు సహచరులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను ప్రపంచ జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో భవిష్యత్తులోనూ తన వంతు కృషిని కొనసాగిస్తానని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలకు పైగా సాగిన తన అధ్యాపక, విద్యా పరిపాలనా ప్రస్థానం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, టీజీసీహెచ్‌ఈ లక్ష్యాల సాధనలో అంకితభావంతో పనిచేసిన సిబ్బంది సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Next Story