Municipal elections: నిజామాబాద్ కార్పొరేషన్‌లో టఫ్ ఫైట్

by Malleboina Mahesh |

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయ పార్టీలతో పాటు నగర ప్రజల్లో హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.

Municipal elections: నిజామాబాద్ కార్పొరేషన్‌లో టఫ్ ఫైట్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయ పార్టీలతో పాటు నగర ప్రజల్లో హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంటుందనే అంశం చుట్టూనే నగర వాసుల ఆలోచనలు వైఫైలా తిరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీల దృష్టి మేయర్ పీఠం పై నే కేంద్రీకృతమయ్యాయి. వేటికవే మేయర్ పీఠం తమదంటే తమదేనంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. 60 డివిజన్ లు కలిగి ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్ లో దాదాపు 18 డివిజన్లలో ఏఐఎంఐఎం పార్టీ ప్రభావం కలిగి ఉంది. ఆ పార్టీకి ఆయా డివిజన్‌లలో పూర్తి పట్టుండటంతో ఇతర పార్టీలకు గెలుపు అవకాశాలు దాదాపు ఉండవనే అభిప్రాయాలున్నాయి. గతంలో ఎన్నోసార్లు ఈ విషయం గత ఫలితాల ద్వారా స్పష్టమైంది. ఈసారి కూడా అదే ఫలితాలు ఆయా డివిజన్లలో పునరావృతం అవుతాయనే అభిప్రాయాలున్నాయి.

నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీకి గట్టి పట్టుండటంతో ఆ పార్టీ మేయర్ పీఠం దక్కించుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచినప్పటికీ మేయర్ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. మేయర్ పీఠాన్ని తృటిలో చేజార్చుకున్న గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈసారి మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో పని చేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో కూడా ఆ పార్టీ ఆచితూచి వ్యవహరించింది. గతంలో పార్టీకి ద్రోహం చేసిన వారికి టిక్కెట్లు ఇవ్వకుండా జాగ్రత్త పడింది. గెలుపు గుర్రాలనుకున్న వారికే టికెట్లిచ్చింది.

ఆపరేషన్ మేయర్ పీఠం..

అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ మేయర్ పీఠం అన్న చందంగా కార్పొరేషన్ ను దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైనంత మెజారిటీ కోసం కాకుండా ప్రతి డివిజన్ ను దక్కించుకునేందుకు గట్టిగా కృషి చేస్‌తోంది. రాష్‌ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా టీపీసీసీ చీఫ్ సొంత జిల్లాలోని ఏకైక కార్పొరేషన్ లో మేయర్ పీఠాన్ని చేజార్చుకుంటే పరువు పోతుందనే ఆలోచనతో అటు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ కార్పొరేషన్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

నిజామాబాద్ అర్బన్ ఇంచార్జి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మరో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, జిల్లాకు చెందిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఐదుగురు, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలు, డీసీసీ ప్రెసిడెంట్ నగేష్ రెడ్డి, అర్బన్ ప్రెసిడెంట్ బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశ వేణులతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా సీరియస్ గా గెలుపుపై దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్ ను దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్న కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీల ఎత్తులను చిత్తు చేయాలని చూస్తోంది.

పీఠాన్ని దక్కించుకోవడానికి స్పష్టమైన మెజారిటీ రాకపోతే..

బీఆర్ఎస్, నిజామాబాద్ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అటు కాంగ్రెస్ కు , ఇటు బీజేపీలకు స్పష్టమైన మేజిక్ ఫిగర్ రాకపోతే ఏం జరుగుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో అనేక సందేహాలు, ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్ బరిలో నిలిచిన బీఆర్ఎస్, ఏ ఐ ఎఫ్ బి అభ్యర్థులు ఎన్ని డివిజన్లలో ప్రభావం చూపుతారోననే, ఎన్నింట్లో గెలుస్తారో ననే చర్చ కూడా మొదలైంది. ఆయా పార్టీలు ఎవరి గెలుపును అడ్డుకుంటారోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ బీజేపీ కి స్పష్టమైన మెజారిటీకి రాకపోతే మేయర్ పీఠం కోసం ఆ పార్టీ కచ్చితంగా ఎవరి మద్దతు తీసుకునే ఛాన్స్ లేదనే టాక్ వినిపిస్తోంది. ఒక వేళ అదే పరిస్థితి కాంగ్రెస్ కు ఎదురైతే మట్టుకు ఆ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కచ్చితంగా ఏఐఎంఐఎం అభ్యర్థుల మద్దతు తీసుకుంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఏఎంఐఎం మద్దతు కీలకమేనా?

ప్రతిసారీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో ఏ రాజకీయ పార్టీకైనా ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థుల ఓట్లే కీలకం అవుతూ వస్తున్నాయి. గత ఎన్నికల్లో కూడా డివిజన్ స్థానాలను దక్కించుకోవడంలో మూడు స్థానానికి పడిపోయిన బీఆర్ఎస్ పార్టీ రెండో అతిపెద్ద పార్టీ ఏఐఎంఐఎం పార్టీకి చెందిన అభ్యర్థుల సపోర్టుతో మేయర్ పీఠాన్ని దక్కించుకోగా, డిప్యూటీ మేయర్ పీఠం ఏఐఎంఐఎం పార్టీ దక్కించుకుంది. అత్యధిక స్థానాలు గెలుచుకున్న అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఉన్నా, రెండో స్థానంలో ఉన్న ఏఐఎంఐఎం పార్టీ మేయర్ పీఠం కోసం బీఆర్ఎస్ కు ఊతమైంది.

అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేసి వ్యూహాత్మకంగా డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకుంది. ఈ సారి కూడా మేయర్ ఎంపికలో ఏఐఎంఐఎం పార్టీ కీలకమైతే తప్పనిసరిగా కాంగ్రెస్ కే సపోర్టు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు మేయర్ పీఠం ప్రతిష్టాత్మకమైన నేపథ్యంలో ఏ పార్టీకి స్సష్టమైన మెజారిటీ రాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏఐఎంఐఎం పార్టీ సపోర్టు తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story