KCRను టచ్ చేయడం.. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే: మాజీ మంత్రి హరీశ్‌రావు హాట్ ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-29 09:12:40  IST  )

ఉద్యమ నేతను టచ్ చేయడం అంటే రాష్ట్ర ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

KCRను టచ్ చేయడం.. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే: మాజీ మంత్రి హరీశ్‌రావు హాట్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యమ నేతను టచ్ చేయడం అంటే రాష్ట్ర ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ అధికారులు కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం పట్ల ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ జాతి పిత, కోట్లాది మంది ప్రజల ఆరాధ్యుడు గౌరవనీయులు కేసీఆర్‌పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్ద కాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని అన్నారు. అలాంటి చరిత్రాత్మక నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమేనని కామెంట్ చేశారు.

పరిపాలన చేతకాక ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. చరిత్రను సృష్టించిన వ్యక్తి కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. అధికారం శాశ్వతం కాదు.. అహంకారం అంతకంటే కాదని అన్నారు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే ఉందని, కాంగ్రెస్ (Congress) రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజలే బుద్ధి చెబుతారని హరీశ్ రావు ట్వీట్ చేశారు.

MORE NEWS : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు తేలాల్సిందే.. కేసీఆర్‌కు సిట్ నోటీసులపై మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Next Story