సెర్చ్ ఇంజన్లలో 'టాప్ ర్యాంకింగ్' ట్రాప్.. క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ!

by Malleboina Mahesh |

సెర్చ్ ఇంజన్లలో టాప్ ర్యాంకింగ్ వెబ్‌సైట్లే లక్ష్యంగా సైబర్ ట్రాప్! నకిలీ లింక్స్‌పై క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ. మోసపోతే వెంటనే 1930 కి కాల్ చేయండి.

సెర్చ్ ఇంజన్లలో టాప్ ర్యాంకింగ్ ట్రాప్.. క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ!
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్ ఎక్స్ వేదికగా ప్రజలను అప్రమత్తం చేస్తూ మరో అలర్ట్ జారీ చేశారు. "గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లలో మనం ఏదైనా వెతికినప్పుడు మొదట కనిపించే వెబ్‌సైట్లు అన్నీ నిజమైనవి కావని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు అధునాతన SEO (Search Engine Optimization) పద్ధతులు, పెయిడ్ యాడ్స్ (Paid Ads) ఉపయోగించి తమ నకిలీ వెబ్‌సైట్లను ముందు వరుసలో ఉంచుతున్నారు. వినియోగదారులు సాధారణంగా పైన కనిపించే లింక్‌లే నిజమైనవని నమ్మి క్లిక్ చేస్తారు. కానీ, ఆ నకిలీ సైట్లు అసలైన బ్యాంకు, ప్రభుత్వ పోర్టల్‌ను పోలి ఉండి, మీ వ్యక్తిగత వివరాలను దొంగిలిస్తాయి.

ముఖ్యంగా కస్టమర్ కేర్ నంబర్లు, బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్ పేమెంట్లకు సంబంధించిన సమాచారం కోసం వెతికేవారు ఈ 'ట్రాప్'లో చిక్కుకుంటున్నారు. నకిలీ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించగానే మీ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్, ఓటీపీ (OTP) అడిగి, క్షణాల్లో మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ కూడా దీనిపై స్పందిస్తూ, 'స్పాన్సర్డ్' (Sponsored) అని ఉన్న ప్రతి లింక్‌ను నమ్మవద్దని, వెబ్‌సైట్ అడ్రస్‌ను (URL) క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

సైబర్ మోసాలకు గురైనప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మోసం జరిగిన మొదటి గంట (Golden Hour) లోపే ఫిర్యాదు చేస్తే, పోగొట్టుకున్న సొమ్మును వెనక్కి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్లను నేరుగా టైప్ చేసి ఓపెన్ చేయడం, నమ్మకమైన యాప్స్ ద్వారా మాత్రమే లావాదేవీలు జరపడం ఉత్తమమని ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ తన ట్వీట్ చెప్పుకొచ్చారు.

Next Story