భూ సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి : కలెక్టర్

by Batti.Sumithra |

సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.

భూ సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి : కలెక్టర్
X

దిశ, నల్లగొండ బ్యూరో : సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. డిండి, దున్నపోతుల గండి తదితర ప్రాజెక్టుల భూసేకరణ మొదలుకొని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసి పూర్తి చేసేలా ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి ఫిర్యాదుల పై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, సాధారణ ప్రజావాణితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, పెద్ద శాఖల్లో ఐదుకు మించి ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా చూడాలని, చిన్న శాఖల్లో అసలు ఫిర్యాదులే పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

ఫిర్యాదుల స్వీకరణ అనంతరం ఎప్పటిలాగే వివిధ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో ప్రవేశాల కోసం వచ్చిన దరఖాస్తులను ఆయా సంక్షేమ శాఖల అధికారులు, విద్యాశాఖ అధికారులు పరిశీలించి వాటికి ప్రాధాన్యత ఇచ్చి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. వనమహోత్సవం కింద ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని పాఠశాలలు, హాస్టళ్లలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ప్రతి విద్యార్థితో ఒక మొక్క నాటించి, దానిని సంరక్షించే బాధ్యత అప్పగించాలని సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలని, ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటలు సాగు చేసి నష్టపోకుండా అవగాహన కల్పించాలని, తగిన వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే పంటలు సాగు చేసుకునేలా వారికి సూచనలు ఇవ్వాలని తెలిపారు.

మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు అన్ని సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని, వచ్చే నెల మొదటి వారంలో ఫుడ్ సేఫ్టీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా అధికారులందరూ మంగళవారంలోగా టూర్ డైరీలు సమర్పించాలని, శాఖలకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. మిర్యాలగూడలో పైలట్ పద్ధతిలో చేపట్టిన నక్షా సర్వే పనులను వేగవంతం చేయాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డీఆర్ఓ దశరథ్, డీఆర్‌డీఓ శేఖర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) శ్రీకాంత్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

Next Story