- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల ఆరోగ్య భద్రతకు బ్రేక్.. నిలిచిపోనున్న క్యాష్‌లెస్ వైద్య సేవలు
పోలీసు సిబ్బంది ఆరోగ్య భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: పోలీసు సిబ్బంది ఆరోగ్య భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు శాఖలో విశేష ఆదరణ పొందిన ప్రతిష్ఠాత్మక ఆరోగ్య భద్రత పథకానికి బ్రేక్ పడింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న క్యాష్‌లెస్ వైద్య చికిత్స సేవలు బుధవారం నుంచి పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ మేరకు పోలీసుల ఆరోగ్య భద్రత సేవలను నిలిపివేస్తున్నట్లు పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి సోమవారం కీలక సర్క్యులర్ జారీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ కొత్తగా ఆరోగ్య పథకాన్ని తీసుకురానున్న నేపథ్యంలో పాత విధానానికి స్వస్తి పలికారు.
ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరిట సమగ్రమైన కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ కొత్త విధానం అమలు కోసం ప్రతి ఉద్యోగి, పెన్షనర్ బేసిక్ పే నుంచి 1.5 శాతం చందాను వసూలు చేయాలని ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. పోలీసు శాఖ కూడా ప్రభుత్వంలో భాగమే కావడంతో, వారికీ ఈ కొత్త పథకమే వర్తించనుంది. ఈ మార్పుల కారణంగా పాత ఆరోగ్య భద్రత పథకం అవసరం లేకపోవడంతో, ఆ పథకం కోసం ఇన్నాళ్లూ సిబ్బంది జీతాల నుంచి పట్టుకుంటున్న నెలవారీ చందా వసూళ్లను జూన్ నెల జీతం నుంచే ప్రభుత్వం నిలిపివేసింది.
అయితే, ఇప్పటివరకు ఉన్న ఆరోగ్య భద్రత పథకం ద్వారా పోలీసు సిబ్బందికి సంబంధించినవి ప్రతినెలా సగటున 3,000 వరకు వైద్య బిల్లులు వస్తున్నట్లు తాజా సర్క్యులర్‌లో అధికారులు పేర్కొన్నారు. జూన్ జీతం నుంచి చందాల వసూలు ఆగిపోవడం, అలాగే ప్రస్తుత విధానంలో ప్రభుత్వం నుంచి ఇకపై పాత పథకానికి సంబంధించిన వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ అందే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిధుల లభ్యత లేనందున క్యాష్‌లెస్ సేవలను నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో కొనసాగించడం సాధ్యం కాదని అధికారులు సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో 2026 జూలై 1వ తేదీ నుంచి ఆరోగ్య భద్రత పథకం కింద ఏ ఎంపానెల్ ఆసుపత్రిలోనూ పాత కార్డులపై నగదు రహిత చికిత్స అందదు. అయితే, కొత్తగా ప్రవేశపెడుతున్న పథకం విధివిధానాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చి, ఆసుపత్రుల్లో సేవలు ప్రారంభం అయ్యే వరకు.. మధ్యలో ఏదైనా అత్యవసర వైద్యం అవసరమైతే పరిస్థితి ఏంటనే ఆందోళన క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందిలో వ్యక్తమవుతోంది.






