- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రెంచ్ పర్యాటకులకు తెలంగాణ అందాలను చేరువ చేస్తాం: మంత్రి జూపల్లి
తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ, డిప్యూటీ కాన్సుల్ పాస్కల్ లోరియో సోమవారం డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ, డిప్యూటీ కాన్సుల్ పాస్కల్ లోరియో సోమవారం డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ-ఫ్రాన్స్ మధ్య పర్యాటకం, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ, పెట్టుబడులు, ప్రజల మధ్య పరస్పర సంబంధాల బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణకు గొప్ప చారిత్రక, సాంస్కృతిక వారసత్వం ఉందని, హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతూనే తన సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించుకుంటోందని అన్నారు. తెలంగాణ పర్యాటక విశేషాలను ఫ్రాన్స్‌లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం, ఫ్రెంచ్ ఎంబసీ, పర్యాటక సంస్థలు భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. ఇరు ప్రాంతాల మధ్య సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, పరస్పర పర్యటనలను మరింత విస్తరించాలని ఆయన సూచించారు. తెలంగాణ-ఫ్రాన్స్ మధ్య ఉన్న సాంస్కృతిక సారూప్యతలు, వారసత్వ పరిరక్షణ, పర్యాటకాభివృద్ధి అవకాశాలను గుర్తించేందుకు సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయాలని, దీనివల్ల ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సహకారానికి బాటలు పడతాయని మంత్రి జూపల్లి తెలిపారు.
ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ మాట్లాడుతూ పర్యాటకం దేశ ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు కీలక రంగమని, ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే దేశాల్లో ఫ్రాన్స్ ఒకటని, ప్రతి సంవత్సరం 10 కోట్లకు పైగా అంతర్జాతీయ పర్యాటకులు ఫ్రాన్స్‌ను సందర్శిస్తున్నారని ఆయన తెలిపారు. పర్యాటకం, సంస్కృతి రంగాల అభివృద్ధి ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని చెప్పారు. భారత్-ఫ్రాన్స్ మధ్య రక్షణ, ఔషధ తయారీ, సాంకేతిక రంగాల్లో బలమైన భాగస్వామ్యం కొనసాగుతోందని, తెలంగాణలో సుమారు 200 మంది ఫ్రెంచ్ పౌరులు నివసిస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణతో పర్యాటకం, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ రంగాల్లో మరింత సహకారానికి ఫ్రాన్స్ సిద్ధంగా ఉందని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ పర్యాటక ప్రాంతాలను ఫ్రెంచ్ పర్యాటకులకు మరింత చేరువ చేసేందుకు సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.






