​అనుమతి లేకుండా తాటి చెట్ల నరికివేత.. గీత కార్మికులు తీవ్ర ఆవేదన

by Jakkula.Mamatha |

హుజూరాబాద్ మండల పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామ శివారులో అనుమతి లేకుండా తాటి చెట్లు నరికివేయడం తీవ్ర కలకలం రేపింది.

​అనుమతి లేకుండా తాటి చెట్ల నరికివేత.. గీత కార్మికులు తీవ్ర ఆవేదన
X

దిశ,​హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండల పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామ శివారులో అనుమతి లేకుండా తాటి చెట్లు నరికివేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన స్థానిక గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలా ఉందంటూ గౌడ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​గీత కార్మికుల ఆవేదన.. చట్టపరమైన చర్యలకు డిమాండ్..

​గౌడ సంఘం గ్రామ అధ్యక్షుడు చింత కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముద్దమల్ల సాగర్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో ఉన్న ఎనిమిది తాటి చెట్లను ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా నరికివేశారు. తాటి చెట్లను నరకడం వల్ల గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చెట్లను తొలగించిన ముద్దమల్ల సాగర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం ఉపాధ్యక్షులు చింత సమ్మయ్య, సభ్యులు పైడిపల్లి సమ్మయ్య, చింత రాజు, నేరెళ్ల కార్తీక్, బండి సమ్మయ్య తదితరులు అధికారులను డిమాండ్ చేశారు.

వ్యవసాయానికి ఇబ్బందిగా మారడం వల్లే..

​ఈ విషయమై నిందితుడిగా పేర్కొంటున్న రైతు ముద్దమల్ల సాగర్‌ను వివరణ కోరగా.. ఆయన తన చర్యను సమర్థించుకున్నారు. సదరు తాటి చెట్లు తన పట్టా భూమిలో ఉన్నాయని, వాటి వల్ల వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని తెలిపారు. ​"ఆ తాటి చెట్లను గీత కార్మికులు ఎవరూ ఉపయోగించుకోవడం లేదు. పైగా వాటి కొమ్మలు, ముంజలు పడి పంట పాడవుతోంది. వీటిని తొలగిస్తానని గత ఆరు నెలలుగా గౌడ సంఘం నాయకులకు, గీత కార్మికులకు చెబుతున్నా ఎవరూ స్పందించలేదు. నరికివేసే ముందు కూడా వారికి సమాచారం ఇచ్చే ఈ నిర్ణయం తీసుకున్నాను." అని రైతు ముద్దమల్ల సాగర్ పేర్కొన్నారు.​ రైతు వివరణ ఎలా ఉన్నప్పటికీ, అనుమతి లేకుండా తాటి చెట్లు నరకడం పై గీత కార్మికులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Next Story