మమతకు మరో షాక్‌.. టీఎంసీ రెబల్‌కు ప్రతిపక్ష నేత హోదా!

by Muthe.Rajitha |

TMC పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలో దాదాపు 59 మంది రెబెల్ ఎమ్మెల్యేలు ఒక గ్రూపుగా ఏర్పడి, మమతా బెనర్జీ నాయకత్వానికి గట్టి సవాల్ విసిరారు.

మమతకు మరో షాక్‌.. టీఎంసీ రెబల్‌కు ప్రతిపక్ష నేత హోదా!
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ, ఇప్పుడు నిలువునా చీలిపోయే (Vertical Split) ప్రమాదంలో పడింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలో దాదాపు 59 మంది రెబెల్ ఎమ్మెల్యేలు ఒక గ్రూపుగా ఏర్పడి, మమతా బెనర్జీ నాయకత్వానికి గట్టి సవాల్ విసిరారు.

స్పీకర్‌కు లేఖ – అసలు ఏం జరిగింది?

తృణమూల్ కాంగ్రెస్‌కు మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందులో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ అంటే దాదాపు 59 మంది రెబెల్ ఎమ్మెల్యేలు బుధవారం కోల్‌కతాలోని అసెంబ్లీకి తరలివచ్చారు. తామంతా రితబ్రత బెనర్జీని లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా ఎన్నుకున్నామని, ఆయన్నే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత (LoP)గా గుర్తించాలని కోరుతూ స్పీకర్ రతీంద్రనాథ్ బోస్‌కు మద్దతు లేఖలను సమర్పించారు. మరోవైపు మమతా బెనర్జీ పక్షం సీనియర్ నేత సౌవన్దేబ్ చట్టోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా నియమించాలని ప్రతిపాదించింది. అయితే, అంతకుముందు పార్టీ సమర్పించిన లేఖలో తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహా వంటి నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఆ ఫిర్యాదు చేసిన కొద్ది నిమిషాల్లోనే వారిని టీఎంసీ బహిష్కరించినప్పటికీ, ఇప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు రెబెల్స్ వైపు నిలబడటం గమనార్హం.

చట్టపరమైన సమీకరణాల సంగతేంటీ?

ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే మొత్తం 80 మందిలో కనీసం 2/3 వంతు అంటే 54 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతానికి రితబ్రత బెనర్జీ వెనుక 58 నుండి 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున, వారు "నిజమైన టీఎంసీ"గా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. రెబెల్ వర్గం సమర్పించిన లేఖలో మమతా బెనర్జీని పార్టీ "చైర్‌పర్సన్" గానే పేర్కొన్నారు. అయితే, పార్టీని కార్పొరేట్ శైలిలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ అభిషేక్ బెనర్జీ లీడర్‌షిప్‌పై, ఆయన నిర్ణయాలపైనే తాము తిరుగుబాటు చేస్తున్నట్లు అసంతృప్త నేతలు స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే తరహాలోనే ఇక్కడ కూడా వ్యూహం అమలువుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కమిటీలు రద్దు చేసిన దీదీ

ఈ పరిణామాలపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ వర్గాల కుట్రల వల్లే తమ పార్టీని చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, తాము దీనిపై పోరాడతామని కోల్‌కతా ధర్నా వేదికగా ప్రకటించారు. కాగా, పార్టీలో అంతర్గత తిరుగుబాటు తీవ్రం కావడంతో టీఎంసీ అధిష్టానం తక్షణ చర్యలు చేపట్టింది. పశ్చిమ బెంగాల్‌లోని అన్ని రకాల పార్టీ కమిటీలను, అనుబంధ సంఘాలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, నూతన కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తామని స్పష్టం చేసింది. కాగా ఎన్నికల ఓటమి గాయం మానకముందే, సొంత పార్టీ ఎమ్మెల్యేలే మెజారిటీ సంఖ్యతో తిరుగుబాటు చేయడం మమతా బెనర్జీకి అత్యంత ప్రతికూలమైన అంశంగా మారింది. స్పీకర్ తీసుకోబోయే తుది నిర్ణయంపైనే బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కుతుందనేది ఆధారపడి ఉంది.

Next Story