- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమీషన్లు తిరిగి ఇచ్చేస్తున్న TMC నేతలు
పశ్చిమ బెంగాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పాలన ముగిసి, బీజేపీ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత.. క్షేత్రస్థాయిలో టీఎంసీ స్థానిక నేతలు, పంచాయతీ సభ్యులపై ప్రజల నుండి తీవ్ర ఒత్తిడి వ్యక్తమవుతోంది. గత ఐదేళ్ల కాలంలో 'ఆవాస్ యోజన', ఉపాధి హామీ (MGNREGA) వంటి వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుండి తాము వసూలు చేసిన 'కట్ మనీ' (అక్రమ కమీషన్లను) స్థానిక నేతలు తిరిగి బాధితులకు చెల్లించడం మొదలుపెట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో ధైర్యం పెరగడం, గ్రామాల్లో నేతలను ఘెరావ్ చేసి ఆందోళనలు చేస్తుండటంతో నేతలు ఈ నిర్ణయానికి వచ్చారు.
కూచ్‌బీహార్ జిల్లాలో ఘుముమారి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక టీఎంసీ పంచాయతీ సభ్యుడు స్వయంగా లౌడ్‌స్పీకర్ ద్వారా బహిరంగ ప్రకటన చేశారు. గతంలో ఆవాస్ యోజన ఇళ్ల మంజూరు కోసం లబ్ధిదారుల నుండి తీసుకున్న రూ. 5,000 నుండి రూ. 20,000 వరకు ఉన్న కట్ మనీని జూన్ 4వ తేదీ లోపు తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. దీనిపై గ్రామస్థులు కూడా ఒక టోటో (ఈ-రిక్షా)పై లౌడ్‌స్పీకర్ కట్టి సదరు నేతకు రిమైండర్లు ఇస్తూ తిరగడం విశేషం. దక్షిణ 24 పరాగణాల్లోని నామ్‌ఖానాలో ఒక స్థానిక టీఎంసీ నేత ఏకంగా 45 మంది లబ్ధిదారులకు, ఒక్కొక్కరికీ రూ. 5,000 చొప్పున నగదును బహిరంగంగానే వెనక్కి ఇచ్చేశారు.
ఇదే తరహా సంఘటనలు బెంగాల్‌లోని మరికొన్ని జిల్లాల్లో కూడా వెలుగుచూస్తున్నాయి. గత ఐదేళ్లలో సేకరించిన అక్రమ వసూళ్లలో ఇప్పటివరకు దాదాపు రూ. 80 లక్షల వరకు ప్రజలకు రీఫండ్ అయినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల ఓటమి తర్వాత ప్రజల్లో వెల్లువెత్తిన అసంతృప్తి ఒక కారణమైతే, బెంగాల్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం అవినీతిపై ప్రత్యేక దర్యాప్తు బృందాలను (SIT) ఏర్పాటు చేయడం, అరెస్టుల భయం పట్టుకోవడమే టీఎంసీ నేతలు వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఈ పరిణామాలపై టీఎంసీ సీనియర్ లీడర్‌షిప్ స్పందిస్తూ.. ఈ కట్ మనీ వ్యవహారాలన్నీ కొందరు స్థానిక నేతల వ్యక్తిగత చర్యలని, వీటికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ దీనిపై తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. బెంగాల్‌లో ప్రస్తుతం "కట్ మనీ రిఫండ్ యోజన" నడుస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా ఎగతాళి చేస్తోంది. ఒకప్పుడు బెంగాల్ రాజకీయాలను తీవ్రంగా కుదిపేసిన 'కట్ మనీ' అంశం, ఇప్పుడు ఇలా బహిరంగంగా వెనక్కి ఇచ్చేసే స్థాయికి చేరడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.






