- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రగ్రహణం ఎఫెక్ట్.. వెలవెలబోతున్న తిరుమల
నేటి చంద్రగ్రహణం ఎఫెక్టుతో ఆలయాలు మూసివేయడంతో భక్తులు లేక తిరుమల వెలవెలబోతోంది.

దిశ, వెబ్ డెస్క్ : నేటి చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం సుమారు 10 గంటల పాటు మూతపడనుంది. భక్తుల రద్దీతో ఎప్పుడూ కళకళలాడే తిరుమల కొండ, గ్రహణం వేళ భక్తులు లేక వెలవెలబోతోంది. మంగళవారం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటల వరకు చంద్రగ్రహణం ఉండనుంది. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం, గ్రహణం ప్రారంభానికి 6 గంటల ముందుగానే ఆలయ ద్వారాలను మూసివేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేడు ఉదయం 9:00 గంటలకే శ్రీవారి ఆలయ గర్భాలయ తలుపులను మూసివేసింది. గ్రహణం ముగిసిన తర్వాత రాత్రి 7:30 గంటలకు తలుపులు తెరిచి, సంప్రోక్షణ, శుద్ధి నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 8:30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ సుదీర్ఘ విరామం కారణంగా తిరుమల మాడ వీధులు, క్యూ లైన్లు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగే తిరుమల గిరులు ప్రస్తుతం ఆధ్యాత్మిక నిశ్శబ్దంలో మునిగిపోయాయి.
కాగా గ్రహణం ప్రభావంతో నేడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు విశేష సేవలను టీటీడీ రద్దు చేసింది. అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవలను పూర్తిగా నిలిపివేశారు. అంతేకాకుండా, తిరుపతిలో జారీ చేసే ఎస్‌ఎస్‌డి (SSD) టోకెన్లను కూడా నిన్న, మొన్న రద్దు చేసిన సంగతి తెలిసిందే. గ్రహణ సమయంలో అన్నప్రసాద వితరణ కేంద్రాలు కూడా మూసివేయనున్నారు. తిరుమలతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజ స్వామి, కోదండరామ స్వామి ఆలయాలు కూడా ఉదయం 9 గంటలకే మూతపడ్డాయి. రాత్రి పూజల అనంతరం తిరిగి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.






