రోడ్డు పక్కన నిల్చున్న వారి పైకి దూసుకెళ్లిన టిప్పర్.. ఇద్దరు మృతి

by Batti.Sumithra |

రోడ్డు దాటేందుకు రోడ్డు పక్కన నిల్చున్న ఇద్దరు వ్యక్తులను టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

రోడ్డు పక్కన నిల్చున్న వారి పైకి దూసుకెళ్లిన టిప్పర్.. ఇద్దరు మృతి
X

దిశ, మీర్‌పేట్ : రోడ్డు దాటేందుకు రోడ్డు పక్కన నిల్చున్న ఇద్దరు వ్యక్తులను టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాద ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండా గ్రామానికి చెందిన సబావత్ సునీల్ (35) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ గుర్రంగూడ ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి స్థానిక మంద మల్లమ్మ కూడలి వద్ద ఆయన ఆటో చెడిపోవడంతో రోడ్డు పక్కన నిలిపి, టోయింగ్ చేయించేందుకు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం రాందుగ్యాల గ్రామానికి చెందిన సబావత్ ప్రసాద్ (26)ను అక్కడికి పిలిచాడు. ఈ క్రమంలోనే అదే పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ సబావత్ సంతోష్ (35 ) ప్రసాద్‌ను కలిసేందుకు అక్కడికి వచ్చాడు. సునీల్ ఆటో సమీపంలో నిలబడి ఉండగా, ప్రసాద్ రోడ్డు దాటాడు. అనంతరం సునీల్, సంతోష్ ఇద్దరు రోడ్డు దాటేందుకు రోడ్డు పక్కనే వేచి ఉన్నారు.

ఈ క్రమంలోనే ఎల్‌బీ నగర్ నుంచి మంద మల్లమ్మ వైపు వెళ్తున్న టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి రోడ్డు పక్కన నిల్చున్న సునీల్, సంతోష్‌లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సునీల్‌ను అంబులెన్స్‌లో హస్తినాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన కూడా మృతి చెందాడు. సంతోష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ జావల సురేష్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన పై కేసునమోదు చేసిన మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story