' ప్రభుత్వ ఫ్రీ ప్రైమరీ స్కూళ్లలో చేరితేనే చిన్నారుల సమగ్ర వికాసం '

by Batti.Sumithra |

చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో ప్రభుత్వ ఫ్రీ ప్రైమరీ స్కూళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని నంచరు ఫ్రీ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయురాలు కే.సంతోష పేర్కొన్నారు.

 ప్రభుత్వ ఫ్రీ ప్రైమరీ స్కూళ్లలో చేరితేనే చిన్నారుల సమగ్ర వికాసం
X

దిశ, మహమ్మదాబాద్ : చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో ప్రభుత్వ ఫ్రీ ప్రైమరీ స్కూళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని నంచరు ఫ్రీ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయురాలు కే.సంతోష పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు పరుగులు తీయకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్యా సౌకర్యాలను వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కే.సంతోష ప్రస్తుత కాలంలో ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, యూనిఫాంలు, పుస్తకాలు, రవాణా ఖర్చులు సాధారణ కుటుంబాల పై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని అన్నారు. పిల్లల చదువు కోసం అనేక కుటుంబాలు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫ్రీ ప్రైమరీ స్కూళ్లలో అదే స్థాయి విద్యతో పాటు అనేక ఉచిత సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, విద్యా సామగ్రి, పోషకాహారంతో కూడిన రెండు పూటల భోజనం, పరిశుభ్రమైన తరగతి గదులు, సురక్షిత వాతావరణం కల్పిస్తున్నారని చెప్పారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు చిన్నారుల వయస్సుకు అనుగుణంగా ఆటల ద్వారా బోధన అందిస్తూ వారి మానసిక, శారీరక, సామాజిక వికాసానికి తోడ్పడుతున్నారని వివరించారు. గ్రామంలోని ప్రతి కుటుంబం తమ 3, 4, 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలను ఫ్రీ ప్రైమరీ స్కూల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల పై ఉన్న అపోహలను విడనాడి, అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు, మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన బోధన చిన్నారుల విద్యాభివృద్ధికి దోహదపడుతున్నాయని ఆమె తెలిపారు.

Next Story