ఏలూరు జిల్లాలో పులి సంచారం.. ఆ గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను వణికిస్తోంది.

ఏలూరు జిల్లాలో పులి సంచారం.. ఆ గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు (Eluru) జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అటవీ సరిహద్దు గ్రామాల్లో పులి తిరుగుతుండటంతో అటు అధికారులు, ఇటు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం.. తెలంగాణలోని కావడిగుండ్ల (Kavadigundla) అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించింది. కావడిగుండ్ల పరిధిలో ఇప్పటికే ఒక లేగదూడపై దాడి చేసి చంపడంతో, ఈ పులి అత్యంత ప్రమాదకరంగా మారిందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పులి ఏలూరు జిల్లాలోని పందిరిమామిడిగూడెం పరిసరాల్లో తలదాచుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పందిరిమామిడిగూడెం, ఇనుమూరు, గాడిదబోరు, అంతర్వేదిగూడెం గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలెవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో పొలాల వద్దకు వెళ్లడం మానుకోవాలని హెచ్చరించారు. పశువుల కాపరులు తమ పశువులను అటవీ సరిహద్దులకు తీసుకెళ్లవద్దని సూచించారు.

ముమ్మరంగా గాలింపు చర్యలు

పులిని పట్టుకునేందుకు, తిరిగి అడవిలోకి పంపేందుకు అటవీ శాఖ అన్ని చర్యలు ముమ్మరం చేసింది. పులి ప్రయాణించే మార్గాల్లో ఎక్కడికక్కడ నిఘా ఉంచేందుకు అధునాతన ట్రాప్ కెమెరా (Trap Cameras)లను ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ బీట్ అధికారులు, ప్రత్యేక బృందాలు రాత్రింబవళ్లు గస్తీ నిర్వహిస్తున్నాయి. మరోవైపు గ్రామాల్లో డప్పు చాటింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి కదలికల వల్ల స్థానిక రైతులు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

Next Story