పంటపొలాల్లో పులి జాడలు.. ఆందోళనలో రైతులు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో పులుల సంచారం పెరిగిపోయింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన పులి రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని గ్రామాల సమీపంలో సంచరిస్తుంది.

పంటపొలాల్లో పులి జాడలు.. ఆందోళనలో రైతులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పులుల సంచారం పెరిగిపోయింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన పులి రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని గ్రామాల సమీపంలో సంచరిస్తుంది. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పులి కదలికలు కనిపించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతోపాటు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని గుంపనపల్లి, చౌట్ పల్లి గ్రామాలకు చెందిన అడవులకు అనుకోని ఉన్న పంటపొలాల్లో పులి జాడలు కనిపించడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో 36పులులు…

రాష్ట్రంలో రెండు టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ లోని టైగర్ రిజర్వ్ లో 36పులులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోనూ పులులు ఉన్నాయి. అయితే గతనెలలో రాష్ట్రవ్యాప్తంగా పులుల గణన నిర్వహించారు. ఈ సర్వేలో పులులతోపాటు ఇతర మాంసాహార జంతువుల ఉనికికి సంబంధించి 994 ఆధారాలు లభించాయి. ఈ సర్వేరిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. సర్వే పరిశీలించిన తర్వాత తెలంగాణలో పులుల సంఖ్యను అధికారికంగా ప్రకటించనున్నారు.

టైగ‌ర్ సెల్ ఏం చేస్తోంది?

రాష్ట్రంలో పులుల సంరక్షణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ అర‌ణ్యభవన్‌లో స్టేట్‌-లెవల్ టైగర్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను ప్రారంభించింది. ఈ చ‌ర్య పుల‌ల‌ను ప‌రిర‌క్షించడంతోపాటు పులులు, మ‌నుషుల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌ను కూడా త‌గ్గించ‌నుందని ప్రకటించారు. దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికీ జిల్లాల వారీగా, విడివిడిగా పులుల కదలికలను గమనిస్తుండగా, తెలంగాణ మాత్రం మొత్తం రాష్ట్రాన్ని కవరుచేసే కేంద్రీకృత కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇలాంటి సాంకేతిక వ్యవస్థలు ప్రస్తుతం కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో మాత్రమే అమల్లో ఉన్నాయని అట‌వీ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పులులు సంచరిస్తుంటే మానిటరింగ్ సెల్ గుర్తించడంలేదనే విమర్శలూలేకపోలేదు. నిత్యం పులులు, చిరుత పులుల కదలికలు, పులుల మ‌ధ్య ఘర్షణ ప్రాంతాలు, మ‌నుషులు, పులుల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ప్రాంతాల‌ను గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఆచరణలో అమలుకావడంలేదు. రాష్ట్రంలోని కవ్వాల్, ఏటూరు నాగారం, కిన్నెరసాని, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లోని పులుల కదలికలు సెల్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని నిర్ణయించారు. కానీ జగిత్యాలలో పులి సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు చెబితేగానీ అధికారులకు తెలియడంలేదు

అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం..

అడవులను విడిచి ఆయా జిల్లాల్లో సంచరిస్తున్న పలులను బంధించడంలో అటవీశాఖ అధికారులు విఫలమయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జాడలను గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. సిద్ధిపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో 12రోజులుగా పులి సంచరిస్తుండడంలో ప్రజలు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. శనివారం రాత్రి యాదాద్రిభువన గిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం గందమల్ల పరిధిలో చెక్కలగూడెంలో లేగదూడను పులి సగం వరకు తినేసింది. దీంతో రైతు భయాందోళనకు గురవుతున్నారు. ఆరు జిల్లాలను పులి భయాందోళన కల్గిస్తున్న అటవీశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని, పులి బంధించడానికి చర్యలు తీసుకోవడంలేదని రైతులు మండిపడుతున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం : అటవీశాఖ అధికారి..

పులుల సంచారంపై అటవీశాఖ అప్రమత్తంగా ఉందని అటవీశాఖ అధికారి తెలిపారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి ఆహారం కోసం తిరుగుతోందని తెలిపారు. ఆవాసం కూడా చూస్తోందని, దట్టమైన అడవి కనిపిస్తే అక్కడే ఉండిపోయే అవకాశముందని చెబుతున్నారు. పులి జాడలను గుర్తించి బంధించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మనుషుల ప్రాణాలను కాపాడ్డానికే ప్రాధాన్యత ఇస్తున్నామని, పశువులు చనిపోతే వాటికి నష్టపరిహారం కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శాస్త్రీయమైన పద్దతిలో పులుల సంరక్షణ కార్యక్రమాలను అమాలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

Next Story