మహారాష్ట్రలో ఘోరం.. రైలు ఢీకొని పెద్ద పులి మృతి

by Malleboina Mahesh |

మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో రైలు ఢీకొని 3 ఏళ్ల వయసున్న పెద్ద పులి మృతి చెందింది. అటవీ అధికారులు పోస్ట్‌మార్టంకు తరలించారు.

మహారాష్ట్రలో ఘోరం.. రైలు ఢీకొని పెద్ద పులి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: రైలు ఢీకొని పెద్ద పులి మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా పరిధిలో గల సిర్పూర్ కాగజ్‌నగర్ - బల్హార్షా రైల్వే సెక్షన్ మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (గురువారం తెల్లవారుజామున) చింతల ధాబా రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌ను దాటుతున్న సమయంలో ఒక పెద్ద పులిని వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. రైలు బలంగా ఢీ కొట్టడంతో ఆ పెద్ద పులి తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు (Forest Officials), రైల్వే సిబ్బంది గురువారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతి చెందిన పులి వయసు సుమారు 2 నుంచి 3 ఏళ్ల మధ్య ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల రక్షణ నిబంధనల ప్రకారం పులి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ సిర్పూర్-బల్హార్ష పరిధి దట్టమైన అటవీ ప్రాంతం కావడం, ఇక్కడ పులుల సంచారం ఎక్కువగా ఉండటంతో రైళ్ల వేగాన్ని నియంత్రించాలని గతంలోనే వన్యప్రాణి ప్రేమికులు కోరారు. అయినప్పటికీ ఈ ప్రమాదం జరగడంపై అటవీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story