ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో టిఫిన్, మధ్యాహ్నం భోజనం

by Malleboina Mahesh |

తెలంగాణలో పాఠశాలలు తెరుచుకుంటున్న నేపథ్యంలో ఎంపిక చేసిన 1,269 ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ (పాలు, రాగి జావ), 33 జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం.

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో టిఫిన్, మధ్యాహ్నం భోజనం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల కోసం సర్కారు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది. రేపటి నుంచి బడులు ప్రారంభమవుతుండగా.. ఎంపిక చేసిన విద్యాసంస్థల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌తోపాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పథకంలో భాగంగా పాఠశాలల విద్యార్థులకు ఉదయం పూట పాలు, రాగి జావ తో కూడిన అల్పాహారం అందిస్తారు. జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. హరేకృష్ణా మూవ్‌మెంట్, మనా ట్రస్ట్ లాంటి స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని ఒకేసారి ప్రారంభించాలనుకున్న.. సెంట్రలైజ్డ్ కిచెన్ల కొరత కారణంగా విడతల వారీగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నది.

1.44 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,302 స్కూళ్లు, కాలేజీలకు చెందిన 1,44,610 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 1,269 పాఠశాలల్లోని 1,30,185 మంది విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం తో పాటు పాలు లేదా రాగి జావ ఇవ్వనున్నారు. ఇందులో హెచ్‌కేఎం ఏజెన్సీ పరిధిలో 1,162 స్కూళ్లు (1,03,891 మంది విద్యార్థులు), మనా ట్రస్ట్ పరిధిలో 107 స్కూళ్లు (26,294 మంది విద్యార్థులు) ఉన్నాయి.

33 జూనియర్ కాలేజీల్లోనూ..

రాష్ట్రంలోని హన్మకొండ, వరంగల్, నారాయణపేట్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి వంటి పలు జిల్లాల్లోని ఎంపిక చేసిన కళాశాలల్లో బ్రేక్ ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అమలు చేయనున్నారు. మొత్తం 33 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని 14,425 మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. హన్మకొండ, పరకాల, నర్సంపేట, వరంగల్ ఈస్ట్, కొడంగల్, పరిగి, తాండూరు, పటాన్‌చెరు, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో హెచ్ కేఎం ఏజెన్సీ ఈ బాధ్యతలను నిర్వర్తించనుంది.

హెచ్‌కేఎం సంస్థ 21 కాలేజీల్లోని 10,293 మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మిడ్ డే మీల్స్ సదుపాయం సమకూరనుంది. హైదరాబాద్, మేడ్చల్ పరిధిలోని అంబర్‌పేట్, అమీర్‌పేట్, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పురా, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి, ముషీరాబాద్, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో మనా ట్రస్ట్ భోజన వసతిని పర్యవేక్షించనుంది. మొత్తం 12 కాలేజీల్లోని 4,132 మంది విద్యార్థులకు మనా ట్రస్ట్ ఈ సేవలను అందించనుంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించవచ్చని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల హాజరు శాతం మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story