బూర్గంపాడులో స్వల్ప భూకంపం

by Batti.Sumithra |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు దాని పరిసర ప్రాంతాలలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది.

బూర్గంపాడులో స్వల్ప భూకంపం
X

​దిశ, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు దాని పరిసర ప్రాంతాలలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నిద్రలో ఉన్న జనం ప్రకంపనల ధాటికి మేల్కొని, ప్రాణభయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున సరిగ్గా రాత్రి 2:26 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

రిక్టర్ స్కేలు పై ఈ భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. దీని కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి వాయువ్య దిశగా సుమారు 111 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో కేంద్రీకృతమైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ​జిల్లాలోని ప్రధాన కేంద్రాలైన కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం తదితర ప్రాంతాల్లో కొద్ది సెకన్ల పాటు భూమి గట్టిగా కంపించింది. ఆ సమయంలో ఇళ్లలోని పాత్రలు, వస్తువులు కదలడంతో ఏం జరుగుతుందో తెలియక జనం గందరగోళానికి గురయ్యారు. గాఢనిద్రలో ఉన్న పలువురు ఒక్కసారిగా ఊగిసలాట రావడంతో భయంతో కేకలు వేస్తూ రోడ్లపైకి వచ్చారు. తెల్లవార్లూ చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోకి వెళ్లేందుకు సాహసించలేదు. ఈ భూకంపం వల్ల ప్రజలు భయాందోళనలకు గురైనప్పటికీ.. ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని జిల్లా అధికారులు ప్రాథమికంగా ప్రకటించారు. తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదమేమీ కాలేదని, ప్రజలు సురక్షితంగా ఉన్నారని పేర్కొంటూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story