- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మో అమావాస్య.. రేపే మోగనున్న బడిగంట
వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

దిశ, ఆలూర్ : వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఈసారి బడిగంట మోగనున్న తొలి రోజు అమావాస్య కావడం చర్చనీయాంశంగా మారింది. అమావాస్య రోజున పిల్లలను పాఠశాలకు పంపడం మంచిది కాదనే అభిప్రాయంతో పలువురు తల్లిదండ్రులు తొలిరోజు స్కూల్‌కు పంపేందుకు వెనుకాడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 15న పాఠశాలలు ప్రారంభం కానున్నప్పటికీ, అమావాస్య సెంటిమెంట్ కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంగళవారం లేదా బుధవారం నుంచి మాత్రమే పంపించాలని భావిస్తున్నారు. కొందరు మంగళవారం కూడా కొత్త కార్యక్రమాలకు అనుకూలం కాదనే నమ్మకంతో నేరుగా బుధవారానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రైవేట్ పాఠశాలలు అదే బాటలో..
అమావాస్య నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సైతం విద్యార్థుల హాజరు తక్కువగా ఉండే అవకాశం ఉందని భావించి నేరుగా జూన్ 17 నుంచే తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు తల్లిదండ్రులకు వాట్సాప్ సందేశాలు పంపుతున్నాయి.
శుక్రవారమే పిల్లలను తీసుకెళ్లిన పేరెంట్స్..
మరికొందరు తల్లిదండ్రులు ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలు తెరవాల్సిన రోజునే తమ పిల్లలను కొద్దిసేపు స్కూల్‌కు తీసుకెళ్లి తిరిగి తీసుకువచ్చిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో అమావాస్య ప్రభావం ఈసారి విద్యారంగంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
జిల్లాలో వేలాది పాఠశాలలు సిద్ధం..
నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల పాఠశాలలు కలిపి సుమారు 1,756 ఉండగా, కామారెడ్డి జిల్లాలో 1,201 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయితే అమావాస్య సెంటిమెంట్ నేపథ్యంలో తొలి రోజు విద్యార్థుల హాజరు ఎంత మేర ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి : విద్యావేత్తలు
అమావాస్య, పౌర్ణమి వంటి ఖగోళ సంఘటనలను శుభాశుభాలతో ముడిపెట్టడం శాస్త్రీయ దృక్పథానికి విరుద్ధమని విద్యావేత్తలు, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు పేర్కొంటున్నారు. చంద్రుడు భూమి, సూర్యుడి మధ్యకు వచ్చినప్పుడు ఆకాశంలో కనిపించని రోజునే అమావాస్యగా పిలుస్తారని, దానికి పిల్లల విద్యాభ్యాసానికీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. విద్య అంటే మూఢనమ్మకాలను పారద్రోలే సాధనమని, అలాంటి విద్య ప్రారంభాన్ని మూఢనమ్మకాలతో ముడిపెట్టడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు. సమాజంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందాలంటే పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజు నుంచే పిల్లలను పంపించాలని సూచిస్తున్నారు.






