సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు.. రెండ్రోజుల షెడ్యూల్ ఇదే

by Naga Rani Yarlagadda |

సీఎం చంద్రబాబు నాయుడు రెండ్రోజుల సింగపూర్ పర్యటనకు బయల్దేరారు.

సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు.. రెండ్రోజుల షెడ్యూల్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు రెండ్రోజుల సింగపూర్ పర్యటనకు బయల్దేరారు. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్లిన సీఎం అండ్ టీమ్.. అక్కడి నుంచి సింగపూర్ కు మరో విమానంలో బయల్దేరారు. సాయంత్రానికి వారంతా సింగపూర్ కు చేరుకోనున్నారు. సోమ, మంగళవారాల్లో ఆ దేశ మంత్రులతో విరివిగా సమావేశాలు కానున్నారు. అలాగే సింగపూర్ ప్రధాని సహా పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా భేటీ అయి.. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు సింగపూర్ లో భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో సమావేశమవుతారు. అనంతరం స్టార్టప్ వెంచర్ కేపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొంటారు. అది పూర్తయ్యాక యూఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్ బాచ్ తో లంచ్ లో పాల్గొంటారు.

మధ్యాహ్నం సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ లింగ్ తో, తర్వాత గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు కరణ్ భజ్వాతో, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ తో భేటీ అవుతారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యెంగ్ చెయ్, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, విదేశాంగమంత్రి బాలకృష్ణమన్, హోంమంత్రి కె.షణ్ముగమ్, హెచ్ఆర్డీ మంత్రి టాన్ సీ లెంగ్ లతో వరుసగా భేటీ కానున్నారు.

మంగళవారం సింగపూర్ లో జరిగే వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించే సీబీఎన్ @361 ప్రోగ్రామ్ ను ప్రారంభించి.. సుర్బాన్ జురాంగ్ - అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సీఐఐ నిర్వహించే రోడ్ షో కు హాజరుకానున్నారు. మంగళవారం సాయంత్రం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ తర్వాత.. ఆయన తిరిగి రాష్ట్రానికి పయనం కానున్నారు.

Next Story