- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ ప్రజలను చూసి గర్వపడుతున్నా.. సీజేపీ నిరసనలో సోనమ్ వాంగ్ చుక్ కామెంట్స్
విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ మాట్లాడుతూ.. సీజేపీ ఒక రాజకీయ వేదిక కాదని, ప్రతి భారతీయుడిని మేల్కొలపడమే దాని ప్రాథమిక లక్ష్యం అని చెప్పారు. దేశ యువతను ముందుకు సాగేలా ప్రోత్సహించి, సమాజానికి సానుకూలంగా దోహదపడేలా చేయడమే ఈ ఉద్యమం లక్ష్యం అని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద కాక్రోచ్ జనతాపార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నీట్‌లో జరిగిన అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా చేస్తున్న ఉద్యమంలో భాగంగా నేడు హైదరాబాద్‌లో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాక్రోచ్ జనతాపార్టీ కార్యకర్తలతో పాటు విద్యార్థులు, యాక్టివిస్టులు పాల్గొన్నారు.
విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ మాట్లాడుతూ.. సీజేపీ ఒక రాజకీయ వేదిక కాదని, ప్రతి భారతీయుడిని మేల్కొలపడమే దాని ప్రాథమిక లక్ష్యం అని చెప్పారు. దేశ యువతను ముందుకు సాగేలా ప్రోత్సహించి, సమాజానికి సానుకూలంగా దోహదపడేలా చేయడమే ఈ ఉద్యమం లక్ష్యం అని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దే సంస్థల్లో వ్యవస్థాగత సమస్యలు సరిదిద్దడంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూడడంపై దేశం దృష్టి పెట్టాలన్నారు. ప్రధానమంత్రితో సహా ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాలన్నారు. విద్యారంగంలో పటిష్టమైన పునాదులు ఉండాలని చెప్పారు. విద్యావ్యవస్థను ప్రక్షాలన చేసి పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల గొంతులు అణచివేయకుండా, వారి గొంతు వినిపించేలా ఉండాలన్నారు. పౌరులు నిర్భయంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేలా ఉండాలన్నారు. కేబీఆర్ పార్కును పరిరక్షించడం కోసం జరుగుతున్న నిరసనల గురించి తనకు తెలుసునని, పర్యావరణ సమస్యలపై గళం విప్పుతున్న హైదరాబాద్ ప్రజలను చూసి గర్వపడుతున్నానని చెప్పారు. నీట్ పేపర్ లీక్ వివాదం తరవాత ఆత్మహత్య చేసుకున్న ఆకాంక్ష చతుర్వేది ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. ఆమె ఉల్లాసంగా, పట్టుదలతో ఉండే విద్యార్థినిగా పేరు సంపాదించుకుందని చెప్పారు. ఆకాంక్ష చదువు కోసం ఆమె తండ్రి రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నారని అన్నారు. తాను డాక్టర్ అయ్యాక కుటుంబ సమస్యలన్నింటినీ తరుస్తానని ఆకాంక్ష తండ్రికి భరోసా ఇచ్చిందని కానీ పేపర్ లీక్ వార్తలతో ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రదీప్ అనే విద్యార్థి కూడా అలానే ఆత్మహత్య చేసుకున్నాడని, ఇలా చాలా మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని అన్నారు.
సీజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్ విజేత దహియా మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది ప్రజలను ఇళ్ల నుండి ఖాళీ చేయించడం లేదా మరో చోటుకు పంపించడం ద్వారా జరగకూడదని, ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కును కలిగి ఉంటాడని అన్నారు. నగరాలను కాంక్రీట్ తో నింపడాన్ని సుందరీకరణ అని పొరపాటు పడకూడదన్నారు. అభివృద్ధి చేసేందుకు చెట్లను నరికివేయడం ఎందుకు అని ప్రశ్నించారు. అభివృద్ధి అనేది పర్యవరణ పరిరక్షణతో పాటు సాగాలని సూచించారు.
ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పరీక్ష పత్రాల లీక్ వివాదాలకు నైతిక బాధత్య వహించాలనే సూత్రం ఆధారంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భారీ రైలు ప్రమాదం తరవాత తన మంత్రి పదవికి రాజీనామా చేసిన లాల్ బహూదర్ శాస్త్రిని ఆయన ఉదాహరణగా గుర్తు చేశారు. గత కొన్ని నెలల పేపర్ లీకులు అవుతున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఆ కుర్చీలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు, సోనమ్ వాంగ్చుగ్ కూర్చోరని చెప్పారు. ఉల్లి గడ్డ రేట్ పెరిగింది అంటే... మేము ఉల్లిగడ్డ తినం అంటున్నారని.. పెట్రోల్ డీజిల్ పెరుగుతున్నాయంటే బంగారం కొనొద్దు అని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తే మీరు తీసుకురాని మిలియన్ డాలర్లు తీసుకువస్తారని చెప్పారు. అత్యాచారాలు జరుగుతున్నాయంటే వాళ్ళు ఆ రాత్రి ఎందుకు పోయారు అంటున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే.... అర్బన్ నక్సలైట్, దేశ ద్రోహి, పాకిస్తాన్ వాడు అంటూ ముద్రలు వేస్తున్నారని అన్నారు. మీరు కాదు మేము దేశ భక్తులం అంటూ మండిపడ్డారు. ఆన్లైన్ లో ప్రారంభం అయిన ఈ ఆవేశం... ఇప్పుడు స్ట్రీట్ ఫైట్ వరకు వచ్చిందని అన్నారు. మీడియా, సోషల్ మీడియా, రాజకీయం మీ చేతిలో పెట్టుకుంటారు కానీ జనాగ్రహాన్ని చేతిలో పెట్టుకోలేరని హెచ్చరించారు. ప్రజల తరపున తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
తెలంగాణ మాజీ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ.. దుర్మార్గపు పరిపాలన చేస్తూ ప్రతి ఏడాది విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పరీక్షలు కూడా చక్కగా పెట్టని సన్యాసులు పాలన చేస్తున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం లీకులు అవుతున్నాయని, దీనికి కారణం క్యాబినెట్ లంచగొండి తనమేనని విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్‌నే కాకుండా ప్రతి దేశ ద్రోహిని మోడీ కాపాడుతున్నాడని మండిపడ్డారు. నాణ్యమైన విద్య ఇవ్వలేని పరిస్థితి అవసరమా.. అంటూ ప్రశ్నించారు. దేశ ప్రజల సంపద ఎటు తీసుకుపోతున్నారని ప్రశ్నించారు. 12 ఏళ్ల మోడీ పాలన బ్రహ్మాండగా ఉందని ఆయన భక్తులు అంటున్నారు.. మోడీ పాలనలో పేదలకు న్యాయం జరిగిందా? అని అడిగారు. మీ జడ్జీలు, మీ అధికారులు ఒక దొంగల ముఠా అంటూ ఫైర్ అయ్యారు. డిగ్రీ చదివిన పిల్లలకు 6శాతం మాత్రమే స్కిల్స్ ఉన్నాయని చెప్తే.. మిగతా 94 శాతం విద్యార్థుల పరిస్థితి ఏంటి? అని నిలదీశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే కాదు.. అతన్ని జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ కి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.






