గాలి నుంచి విద్యుత్ వరకు.. విండ్ టర్బైన్ టెక్నాలజీపై పెరుగుతున్న ఆసక్తి

by Javid Pasha |

గాలి నుంచి విద్యుత్ వరకు.. విండ్ టర్బైన్ టెక్నాలజీపై పెరుగుతున్న ఆసక్తి
X

దిశ, ఫీచర్స్ : మారుతున్న పర్యావరణ పరిస్థితులు, వనరుల సంరక్షణపై అవగాహన, పెరిగిపోతున్న ఇంధన ఖర్చులు వంటివి ఇటీవల ప్రత్యామ్నాయ వనరులపై ఆలోచనలను, చర్చలను రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిశోధకులు విండ్ టర్బైన్ టెక్నాలజీపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే ఇది అందుబాటులో ఉన్నప్పటికీ, ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఎలా డెవలప్ చేయాలి? ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న విషయంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇంతకీ విండ్ టర్బైన్ టెక్నాలజీ అంటే ఏమిటి? దానివల్ల ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గాలి.. గతిశక్తి..

విండ్ టర్బైన్ టెక్నాలజీ అనేది గాలి, దాని గతి శక్తి(Kinetic Energy)ని యాంత్రిక శక్తిగా, ఆపై విద్యుత్ శక్తిగా మార్చే ఆధునిక సాంకేతికత. పునరుత్పాదక ఇంధన వనరుల(Renewable Energy)లో ఇదొక ముఖ్యమైన భాగం. గాలి వీచినప్పుడు టర్బైన్ బ్లేడ్స్ తిరగడం ద్వారా ఈ శక్తి మార్పిడి జరుగుతుంది. అయితే ఈ బ్లేడ్స్ రోటర్‌కు అనుసంధానం చేయబడి ఉంటాయి. రోటర్ తిరగడం ద్వారా లోపలి గేర్‌బాక్స్ ద్వారా హై స్పీడ్ షాఫ్ట్ తిరుగుతుంది. ఈ యాంత్రిక శక్తి జనరేటర్‌కు చేరి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

కంప్యూటర్ నియంత్రణ వ్యవస్థలతో..

ఆధునిక విండ్ టర్బైన్‌లు స్మార్ట్ సెన్సార్లు, కంప్యూటర్ నియంత్రణ వ్యవస్థలతో అమర్చబడి ఉంటాయి. గాలి వేగం, దిశ మారినప్పుడు టర్బైన్‌ను అనుకూలమైన దిశలో ఆటోమేటిగ్గా తిప్పుతాయి. ఒక్కొక్క టర్బైన్ 2 నుంచి 15 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేయగలదు. ఆఫ్‌షోర్ (సముద్రం మీద) టర్బైన్‌లు ఎక్కువ గాలి వీయడం, వేగంగా వీయడం కారణంగా మరింత ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అయితే ఈ విండ్ ఎనర్జీ పర్యావరణానికి అనుకూలమైన, పునరుత్పాదక వనరే కాకుండా, ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గించి, విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోందని నిపుణులు అంటున్నారు. అయితే గాలి వేగం స్థిరంగా లేకపోవడం, పక్షులకు ముప్పు వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇది భవిష్యత్ క్లీన్ ఎనర్జీ మూలంగా మరింత ప్రాముఖ్యత సంపాదిస్తోంది.

రకాలు-ఉపయోగాలు

1. హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్

హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా ఉపయోగించే రకం. బ్లేడ్స్ (సాధారణంగా 2 లేదా 3) భూమికి సమాంతరంగా తిరుగుతాయి. టవర్ పైన నాసెల్ ఉంటుంది. ఇందులో అప్‌విండ్ టర్బైన్స్ (గాలి ముందు వైపు బ్లేడ్స్ ఉంటాయి), అలాగే డౌన్‌విండ్ టర్బైన్స్ (గాలి వెనుక వైపు బ్లేడ్స్ ఉంటాయి) అనే ఉప విభాగాలు ఉన్నాయి. పెద్ద స్థాయి విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువగా వీటినే ఉపయోగిస్తారు.

2. వెర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్

వెర్టికల్ యాక్సిస్ రకం టర్బైన్స్ బ్లేడ్స్ నేలకు లంబంగా (వెర్టికల్) తిరుగుతాయి. గాలి ఏ దిశ నుంచి వచ్చినా పని చేస్తాయి (యానిసోట్రోపిక్). టవర్ ఎత్తు తక్కువగా ఉండవచ్చు, నిర్వహణ సులభమని నిపుణుల చెబుతున్నారు. ఇందులో డార్రియస్ టర్బైన్ (గిన్నె ఆకారం లాంటి బ్లేడ్స్), సవోనియస్ టర్బైన్ (డ్రమ్ ఆకారం, తక్కువ వేగంలో కూడా పనిచేస్తుంది) అనే దీంతోపాటు ప్రధాన ఉపరకాలు ఉన్నాయి.

అందుబాటులో ఉందా?

భారతదేశంలో విండ్ టర్బైన్ టెక్నాలజీ బాగా అందుబాటులో ఉంది. 2026 మార్చి నాటికి దేశంలో విండ్ పవర్ స్థాపిత సామర్థ్యం సుమారు 56 GWకి చేరుకుంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ ఉత్పాదక దేశం కూడా భారతదేశమని నివేదికలు పేర్కొటున్నాయి. గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా వ్యాపించి ఉంది. దేశీయ తయారీ సామర్థ్యం సంవత్సరానికి 18,000 MW వరకు ఉంది. ప్రధాన భారతీయ కంపెనీలు, అలాగే పలు అంతర్జాతీయ కంపెనీలు దీనిని అభివృద్ధి చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని ప్రోత్సహించడానికి కొత్త కొత్త పాలసీలు, సబ్సిడీలు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

ప్రయోజనాలు ఏమిటి?

విండ్‌ టర్బైన్ టెక్నాలజీ పర్యావరణ హితమైనది. కార్బన్ ఉద్గారాలు ఉండవు, ప్రతికూల వాతావరణ మార్పులను తగ్గిస్తుంది. ఇంధన ఖర్చు లేకుండా విద్యుత్ ఉత్పత్తి సాధ్యం అవడమే కాకుండా, దీర్ఘకాలంలో ఇది చౌకగా లభిస్తుంది. ఇది బాగా విస్తరిస్తే.. గాలిని విద్యుత్ శక్తిగా మార్చుకోవడం ద్వారా దిగుమతి చేసుకునే ఇంధనాలపై ఆధారపడకుండా స్వచ్ఛమైన ఎనర్జీని పొందవచ్చు.

Next Story