కొడంగల్‌ను దెబ్బతీసేందుకు కుట్రలు.. తిప్పికొట్టండి: సీఎం రేవంత్ రెడ్డి

by Jakkula.Mamatha |

సొంత గడ్డ కొడంగల్ రాజకీయ పునాదులను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని, ఆ కుట్రలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ఘాటుగా పిలుపునిచ్చారు.

కొడంగల్‌ను దెబ్బతీసేందుకు కుట్రలు.. తిప్పికొట్టండి: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, కొడంగల్: సొంత గడ్డ కొడంగల్ రాజకీయ పునాదులను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని, ఆ కుట్రలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ఘాటుగా పిలుపునిచ్చారు. కొడంగల్‌లోని తన సొంత నివాసంలో స్థానిక నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లతో (BLA) నేడు బుధవారం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సమీక్షా సమావేశంలో సీఎం దిశానిర్దేశం చేశారు.

అక్కడే నా బలం.. అందుకే ఈ కుట్రలు!

రాష్ట్ర స్థాయిలో తనను రాజకీయంగా బలహీనపర్చాలంటే ముందుగా కొడంగల్‌లో కాంగ్రెస్ బలాన్ని దెబ్బతీయాలనే వ్యూహంతో ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్లు వేరైనా బీజేపీ, బీఆర్ఎస్ లక్ష్యం ఒక్కటేనని, బీజేపీ-బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను, ముఖ్యంగా SC, ST, మైనారిటీల ఓట్లను తొలగించేందుకు గూడుపుఠాణి చేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధి కోసం తాను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని, ఈ క్రమంలో కొడంగల్‌లో కుట్రలు చేసేవారికి రాజకీయంగా సరైన బుద్ధి చెప్పే బాధ్యత స్థానిక కార్యకర్తలపైనే ఉందన్నారు.

22% ఓట్లు పెండింగ్.. అత్యంత ప్రమాదకరం!

నియోజకవర్గంలోని ఓటర్ల నమోదు ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి గణాంకాలతో సహా హెచ్చరించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,96,620 ఓట్ల ప్రక్షాళన పూర్తయింది. ఇంకా 54,635 మంది ఓటర్ల నమోదు పెండింగ్‌లో ఉండిపోయింది. మొత్తం ఓట్లలో దాదాపు 22 శాతం నమోదు కాకపోవడం ముమ్మాటికీ ప్రమాదకరమని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ నెల 30న డెడ్‌లైన్.. ఇంటింటికీ BLAలు!

SIR ప్రక్రియకు అధికారికంగా ఆగస్టు 3 వరకు గడువు ఉన్నప్పటికీ, ఈ నెల 30 నాటికి కొడంగల్‌లో 100% ఓటరు ప్రక్షాళన పూర్తి చేయాలని కార్యకర్తలకు డెడ్‌లైన్ విధించారు. ప్రతి BLA ఇంటింటికీ వెళ్లి ఓటరు వెరిఫికేషన్ ఫారాలు పూర్తి చేయించాలని, ఎన్నికల అధికారులకు సరైన వివరాలు అందించి అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

సమావేశంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జాయింట్ కలెక్టర్ వెంకటాచారి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్. గురునాథ్ రెడ్డి, కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముద్దప్ప, మాజీ ఎమ్మెల్యే జగ్గప్ప, పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వ సుజాత, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు యూసుఫ్, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు వెంకట్రావు, నరసింహులు గౌడ్, గుళ్ల నరసింహులు, నరేందర్, వర్ల విజయ్‌కుమార్, జంగం వీరన్న, ధర్‌సింగ్, కృష్ణంరాజ్, బోడి వెంకట్ రెడ్డి, రెడ్డి శ్రీనివాస్ పాటు కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story