పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మల్దకల్‌లో ఘనంగా పై అప్రాక్సిమేషన్ డే నిర్వహణ

by Batti.Sumithra |

జూలై 22ను పురస్కరించుకుని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మల్దకల్‌లో పై అప్రాక్సిమేషన్ డే ను ఘనంగా నిర్వహించారు.

పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మల్దకల్‌లో ఘనంగా పై అప్రాక్సిమేషన్ డే నిర్వహణ
X

దిశ, మల్దకల్ : జూలై 22ను పురస్కరించుకుని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మల్దకల్‌లో పై అప్రాక్సిమేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. సురేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా π (పై) విలువ, దాని చరిత్ర, గణితంలో ప్రాముఖ్యత, వృత్తాల వైశాల్యం, చుట్టుకొలత గణనలో దాని వినియోగం, అలాగే శాస్త్ర–సాంకేతిక రంగాల్లో π పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా, పై అప్రాక్సిమేషన్ డే ఉద్దేశ్యాన్ని వివరించి, గణితంపై ఆసక్తిని పెంపొందించే కార్యక్రమాల అవసరాన్ని విద్యార్థులతో చర్చించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పై విలువను 100 దశాంశ స్థానాల వరకు తెలిపారు. అలాగే ఆర్యభట్టీయంలో పేర్కొన్న పై విలువకు సంబంధించిన శ్లోకాన్ని పఠించి, దాని అర్థాన్ని వివరించారు. గణితంలో పై విలువ ఉపయోగించే సందర్భాలకు సంబంధించిన తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో గణితం పై ఆసక్తి, తార్కిక ఆలోచనా శక్తి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయని ప్రధానోపాధ్యాయులు జి. సురేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శుభ, భాస్కర్, జాకీర్ హుస్సేన్, వరలక్ష్మి, నాగేశ్వరరావు, ప్రదీప్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story