మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి

by Ratna Kumari |

యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండి విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తేనే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోగలరని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ ఎం.సోమనాథం అన్నారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండి విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తేనే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోగలరని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ ఎం.సోమనాథం అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) నిజామాబాద్ ఆధ్వర్యంలో గిర్‌రాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సోమనాథం మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి స్నేహాలను ఎంచుకుని స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. సరదాగా ఒక్కసారి మాదకద్రవ్యాలను వినియోగించినా అది వ్యసనానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డ్రగ్-ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమానికి రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు. తోటి వారి ఒత్తిడికి లొంగకుండా కుటుంబ సభ్యులు, సమాజంలో అవగాహన కల్పించాలని సూచించారు. సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ, యువతలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. "డ్రగ్స్‌కు నో... జీవితానికి యెస్" అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి ఆచరణలో పెట్టాలని కోరారు. ఈగల్ ఫోర్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ సందీప్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సమకూరే నిధులు నేర, ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించబడుతున్నాయని పేర్కొన్నారు. డ్రగ్ మాఫియా ప్రధానంగా యువతనే లక్ష్యంగా చేసుకుంటోందని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం సాంగ్ అండ్ డ్రామా బృందం ‘పల్లె సుద్దులు’ జానపద కళారూపం ద్వారా నషా ముక్త్ భారత్ సందేశాన్ని ఆకట్టుకునే రీతిలో ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఆకాశవాణి ప్రతినిధులు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారులు, 400 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story