- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత, విద్యార్థుల రక్తం చూడటమేనా దేశభక్తి..?
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు డిమాండ్ చేశారు.

దిశ,నిజాంసాగర్ : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల అరెస్టులను కూడా ఆయన తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గేట్ వద్ద జాతీయ రహదారి–161పై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేసి భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తోంది. నీట్ పేపర్ లీకేజీ వంటి ఘటనలు దేశ విద్యా వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర అనుమానాలను కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివే విద్యార్థులు, వారిని ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి కోచింగ్‌కు పంపుతున్న తల్లిదండ్రుల ఆశలను కేంద్ర ప్రభుత్వం నీరుగార్చుతోంది. యువత భవిష్యత్తును కాపాడాల్సిన ప్రభుత్వం వారి జీవితాలతో ప్రయోగాలు చేయడం అత్యంత బాధాకరం అని అన్నారు. శాంతియుతంగా తమ హక్కుల కోసం ప్రశ్నిస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీలు చేయించడం ప్రజాస్వామ్యానికి మచ్చ. యువత, విద్యార్థుల రక్తం చూడటమేనా దేశభక్తి? ప్రశ్నించిన వారిని అణచివేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. విద్యార్థుల గొంతును లాఠీలతో అణచివేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు అని ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాలి అన్నారు.
విద్యా వ్యవస్థను రాజకీయాలకు అతీతంగా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కానీ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రశ్నించిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయించడం అత్యంత దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అని అన్నారు. దేశ భవిష్యత్తైన యువతలో విశ్వాసం కల్పించాల్సిన ప్రభుత్వం వారిలో నిరాశను నింపుతోంది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు కాంగ్రెస్ పార్టీ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుంది అని ఏలే మల్లికార్జున్ స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్, మారేడి కృష్ణారెడ్డి, నాయకులు వకీల్ రాంరెడ్డి,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఇమ్రోజ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






