- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీరని విషాదం: షార్ట్ ఫిలిం తీయబోయి ముగ్గురు యువకుల జలసమాధి!
కడపలో విషాదం! షార్ట్ ఫిలిం చిత్రీకరణకు వెళ్లి పెన్నా నదిలో ముగ్గురు యువకులు మృతి. "ఫ్రంట్‌లైన్ ప్రెస్" బృందంలో జలవిషాదం.

దిశ, వెబ్ డెస్క్: షార్ట్ ఫిలిం తీయబోయి ముగ్గురు యువకుల జలసమాధి కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ షాకింగ్ ఘటన కడప జిల్లాలోని వల్లూరు మండలం పుష్పగిరి గ్రామ పరిధిలోని పెన్నా నది తీరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వేదికగా పరిచయమైన కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన ఎనిమిది మంది యువకులు "ఫ్రంట్‌లైన్ ప్రెస్" (Frontline Press) అనే పేరుతో ఒక బృందంగా ఏర్పడి గత కొంతకాలంగా షార్ట్ ఫిలిమ్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం వీరంతా పుష్పగిరి వద్దకు చేరుకున్నారు.
నది తీరంలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఊహించని విధంగా ప్రమాదం సంభవించింది. నీటిలో కొన్ని దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన హరిబాబు (25), హర్షవర్ధన్ (22), కృష్ణ చైతన్య (20) అనే ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు లోతైన ప్రవాహంలోకి వెళ్లి మునిగిపోయారు. గమనించిన మిగతా ఐదుగురు స్నేహితులు వారిని కాపాడటానికి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, నీటి వేగం ఎక్కువగా ఉండటంతో వారిని రక్షించలేకపోయారు. కళ్లముందే స్నేహితులు నీటిలో మునిగిపోవడంతో మిగిలిన యువకులు భయభ్రాంతులకు గురై స్థానికులకు మరియు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే వల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక మత్స్యకారులు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గంటల తరబడి శ్రమించిన తర్వాత హరిబాబు, హర్షవర్ధన్ మృతదేహాలు లభించాయి. మరో యువకుడు కృష్ణ చైతన్య మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. కాగా ఈ ప్రమాద మృతులంతా 20 నుంచి 25 ఏళ్ల లోపు వయసున్న వారే కావడంతో వారి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. షార్ట్ ఫిల్మ్స్ తీసి ఉన్నత స్థాయికి ఎదగాలనుకునే వారి కలలు ఇలా జలసమాది కావడంపై సోషల్ మీడియా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది.






