- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ వేధింపుల కేసులో ముగ్గురు అరెస్ట్
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన యువతి గోషిక మాధవి ఆత్మహత్య కేసులో జైపూర్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

దిశ, మంచిర్యాల/మందమర్రి : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన యువతి గోషిక మాధవి ఆత్మహత్య కేసులో జైపూర్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోనె వెంకటేష్‌తో పాటు అతని తల్లి గోనె శంకరమ్మ, అక్క గోనె శైలజలను మంగళవారం అదుపులోకి తీసుకుని పంచనామా నిర్వహించి, నిందితులను కోర్టుకు తరలించినట్లు జైపూర్ సీఐ నవీన్ కుమార్, ఎస్సై భూమేష్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు గోనె వెంకటేష్ విచారణలో కీలక విషయాలను వెల్లడించినట్లు ఎస్సై భూమేష్ పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే, సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్న మాధవికి రెండేళ్ల క్రితం వెంకటేష్‌తో పరిచయం ఏర్పడగా, ఆ పరిచయాన్ని ప్రేమగా భావించి, ఆమె అంగీకరించకపోయినా నిరంతరం వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని మాధవిని ఒత్తిడి చేసి వేధించాడు. ఈ విషయాన్ని తన తల్లి శంకరమ్మ, అక్క శైలజకు చెప్పగా, ముగ్గురూ కలిసి యువతి ఇంటికి వెళ్లి పెళ్లి చేయాలని కోరారు. అయితే కులాలు వేరవడంతో యువతి కుటుంబ సభ్యులు నిరాకరించినట్లు తెలిపారు.
మాధవితో పెళ్లి చేయకపోతే తన పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానంటూ వెంకటేష్ పలుమార్లు బెదిరించినట్లు వెల్లడైంది. ఈ నెల జూలై 10వ తేదీన గోదావరిఖనిలో మాధవిని కలిసిన వెంకటేష్, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి, అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు విచారణలో వెల్లడించాడు. జూలై 11న పెద్దల సమక్షంలో జరిగిన పంచాయతీలోనూ యువతి కుటుంబం వివాహానికి నిరాకరించడంతో, వెంకటేష్ తల్లి, అక్క కలిసి మా వాడికి ఏదైనా జరిగితే మీదే బాధ్యత అంటూ బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వెంకటేష్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని డేటా పరిశీలించగా, మాధవికి తరచూ కాల్స్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడని, ఫోన్‌ను స్వాధీనం చేసుకుని సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నట్లు పంచనామాలో పేర్కొన్నారు. అనంతరం శంకరమ్మ, శైలజల వాంగ్మూలాలు కూడా నమోదు చేయగా, వారు కూడా ప్రధాన నిందితుడు తెలిపిన వివరాలనే ధృవీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఎస్సై భూమేష్‌ను సీఐ నవీన్ కుమార్ అభినందించారు.






