- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అద్దెగదుల్లో అంగన్‌వాడీ సెంటర్లు.. ఇరుకు గదుల్లోనే చిన్నారుల బాల్యం
తెలంగాణలో 10వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలు సొంత భవనాలు లేక ఇరుకు అద్దె గదుల్లో నడుస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: చిన్నారుల భవిష్యత్ కు పునాది వేయాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయి. చాలా జిల్లాల్లో సెంటర్లకు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె గదులు, ఇరుకు సందుల్లో కొనసాగిస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో వేలాదిగా టీచర్లు, ఆయా పోస్టుల ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో సుమారు 35,700 పైగా అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. అందులో 10వేలకు పైగా సెంటర్లకు సొంత భవనాలు లేవని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చిన్న అద్దె గదులు, గాలి, వెలుతురు చొరబడని ఇరుకు సందుల్లో ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. చిన్నారులు కూర్చోవడానికి, ఆడుకోవడానికి సరిపడా స్థలం ఉండటం లేదు. చాలా కేంద్రాల్లో కనీసం మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కూడా లేదు. అటు అద్దెలు సకాలంలో చెల్లించకపోవడంతో భవనాల యజమానులు ఖాళీ చేయించడమో, లేదా కేంద్రాలకు తాళాలు వేయడమో చేసిన సంఘటనలు జిల్లాల్లో తరచూ వెలుగులోకి వచ్చాయి.
టీచర్లు, ఆయాలు ఎక్కడ?
రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆయాలు లేని చోట వంట వండటం, పిల్లలను చూసుకోవడం, కేంద్రం శుభ్రం చేయడమంతా టీచరే చేయాల్సి వస్తోంది. దీనివల్ల పిల్లలకు నాణ్యమైన ప్రీస్కూల్ విధానం సరిగా అమలు కావడం లేదు. బరువులు తూచడం, గర్భిణులకు పౌష్టికాహార పంపిణీ, రికార్డుల నిర్వహణ కూడా భారంగా మారిందని టీచర్లు చెబుతున్నారు.
తొలిముద్దపై ప్రభావం
అంగన్‌వాడీలు వారంలోగా పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తొలిముద్దు కార్యక్రమం అమలు పైనా భారం పడనుంది. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి పైలట్ ప్రాజెక్టు కింద భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 2100 సెంటర్లు ఉండగా, 197 టీచర్, వెయ్యికి పైగా ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత కారణంగా తొలిముద్ద అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క భద్రాద్రి జిల్లాలోనే ఇన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయంటే రాష్ట్రవ్యాప్తంగా ఆయా సెంటర్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పూర్తికాని కొత్త భవనాలు
ప్రభుత్వాలు మారుతున్నా అంగన్‌వాడీల తీరు మారడం లేదు. బడ్జెట్‌లో నిధుల కేటాయిస్తున్నా, క్షేత్రస్థాయిలో కొత్త భవనాల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఖాళీల భర్తీ ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో సిబ్బందిపై పనిభారం పెరుగుతున్నది. రేపటి పౌరులను తీర్చిదిద్దే ఈ అంగన్‌వాడీలను ఎవరు పట్టించుకుంటారని అటు సిబ్బంది, ఇటు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఖాళీలను భర్తీ చేయడం తో పాటు సొంత భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
మొత్తం ఐసీడీఎస్ ప్రాజెక్టులు : 149
రూరల్ ప్రాంతంలో : 99
అర్బన్ ప్రాంతంలో: 25
ట్రైబల్ ఐసీడీఎస్ ప్రాజెక్టులు : 25
మొత్తం అంగన్‌వాడీ సెంటర్లు: 35,781
రూరల్ ప్రాంతంలో: 24,942
అర్బన్ ప్రాంతాల్లో: 6,655
ట్రైబల్ ఏరియాలో: 4,184






