- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టాంపింగ్ పేరుతో వేలల్లో వసూళ్లు!
సూర్యాపేట జిల్లాలో లీగల్ మెట్రాలజీ(తూనికలు-కొలతల) శాఖ పేరుతో ముగ్గురు వ్యక్తులు వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ స్టాంపింగ్ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ,సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో లీగల్ మెట్రాలజీ(తూనికలు-కొలతల) శాఖ పేరుతో ముగ్గురు వ్యక్తులు వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ స్టాంపింగ్ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ శాఖ అధికారులమంటూ చెప్పుకుంటూ, స్టాంపింగ్, తనిఖీలు, రిపేర్లు అనే పేర్లతో జిల్లాలోని బియ్యం దుకాణాలు,కిరాణా దుకాణాలు, ఐకేపీ సెంటర్లు, పండ్ల వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, మటన్, చికెన్, చేపల దుకాణాల యజమానులను లక్ష్యంగా చేసుకుని ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వ్యాపారులకు తూనికలు, కొలతల కాంటాలకు నిర్దిష్ట కాల వ్యవధిలో స్టాంపింగ్ చేయించుకోవడం తప్పనిసరి. ఈ నిబంధనను ఆసరాగా చేసుకున్న ఆ ముగ్గురు ప్రైవేటు వ్యక్తులు తమను అధికారులుగా పరిచయం చేసుకుంటూ, స్టాంపింగ్ ఉంటే ఒక రేటు, లేకపోతే మరో రేటు అంటూ వేల రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే కాంటాలను సీజ్ చేస్తామని, తనిఖీలు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని పలువురు వ్యాపారులు వాపోతున్నారు.జిల్లాలోని అనేక కిరాణా దుకాణాలు, ఐకేపీ కేంద్రాలు, పండ్ల మార్కెట్లు, కూరగాయల వ్యాపారులు, మాంసం విక్రయ కేంద్రాల్లో స్టాంపింగ్ పేరుతో రూ.1,000 నుంచి రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. స్టాంపింగ్ లేని కాంటాలను విక్రయిస్తూ లక్షల్లో అక్రమంగా సంపాదిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముగ్గురి మధ్య గొడవతో బయటపడ్డ వ్యవహారం..
కొద్దిరోజుల క్రితం నూతనకల్ మండల కేంద్రంలోని ఓ కిరాణా దుకాణంలో లైసెన్స్ కలిగిన వ్యక్తి కాంటాకు స్టాంపింగ్ వేశాడు. అనంతరం అక్కడికి వెళ్లిన మరో రిపేర్ చేసే వ్యక్తి ఇప్పటికే స్టాంపింగ్ అయి ఉండడాన్ని గమనించి, మొదట స్టాంపింగ్ చేసిన వ్యక్తికి ఫోన్ చేసి వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. రూ.3,000 వసూలు చేస్తావు.. అందులో నాకు సగం ఇవ్వాలి అంటూ ఇద్దరి మధ్య వివాదం జరగడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులోని మటన్ షాపుల్లో స్టాంపింగ్ పేరుతో కొన్ని దుకాణాల నుంచి రూ.2,000 చొప్పున వసూలు చేసినట్లు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. దీనిపై కొందరు వ్యాపారులు తూనికలు-కొలతల శాఖ కార్యాలయానికి వెళ్లగా, కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో వెనుదిరిగినట్లు సమాచారం.
రెగ్యులర్ ఉద్యోగి లేని శాఖ.. ప్రైవేట్ వ్యక్తుల హవా..
జిల్లాలో తూనికలు-కొలతల శాఖలో రెగ్యులర్ అధికారి లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేటు వ్యక్తులు అధికారుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లైసెన్స్ లేని కాంటాల విక్రయానికి సహకరిస్తూ, స్టాంపింగ్ పేరుతో భారీగా డబ్బులు దండుకుంటున్నారని వ్యాపారులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.దీపావళి, బక్రీద్, ఇతర పండగల సమయంలో మాంసం విక్రయాలు అధికంగా జరిగే వేళ, వ్యాపారులు ఉపయోగించే కాంటాలను తనిఖీ పేరుతో ఈ ముగ్గురు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పండగల సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టాళ్ల వద్దకే వెళ్లి డబ్బులు వసూలు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
లైసెన్స్ లేని కాంటాల విక్రయం
జిల్లా కేంద్రంలో లైసెన్స్ లేకుండా స్టాంపింగ్ లేని కాంటాలను విక్రయిస్తూ కూడా ఈ ముగ్గురు అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక కాంటాకు స్టాంపింగ్ చేయించేందుకు రూ.1,000, స్టాంపింగ్ లేకపోతే రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు.తూనికలు-కొలతల శాఖ పేరుతో వ్యాపారస్తులను వేధిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు వెలికితీయాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.
మా దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం..
నాగేశ్వరరావు, తూనికల కొలతల శాఖ సూర్యాపేట జిల్లా ఇంచార్జి అధికారి.. తూనికలు-కొలతల శాఖ పేరుతో ప్రైవేటు వ్యక్తులు వ్యాపారస్తుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా స్టాంపింగ్ లేదా రిపేర్ పేరుతో వస్తే తప్పనిసరిగా బిల్ తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయించిన రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తే వెంటనే మా దృష్టికి తీసుకు రండి. ఫిర్యాదు అందితే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.






