నేడే తొలి ఏకాదశి.. తెలుగు సంవత్సరంలో తొలి పండగ విశేషాలివే

by Muthe.Rajitha |

హిందూ సంస్కృతీ సాంప్రదాయాలలో ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే అత్యంత పవిత్రంగా 'తొలి ఏకాదశి' లేదా 'శయని ఏకాదశి'గా జరుపుకుంటారు.

నేడే తొలి ఏకాదశి.. తెలుగు సంవత్సరంలో తొలి పండగ విశేషాలివే
X

దిశ, వెబ్ డెస్క్ : హిందూ సంస్కృతీ సాంప్రదాయాలలో ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే అత్యంత పవిత్రంగా 'తొలి ఏకాదశి' లేదా 'శయని ఏకాదశి'గా జరుపుకుంటారు. తెలుగు సంవత్సర క్యాలెండర్ ప్రకారం తొలి ఏకాదశి పండగతోనే తెలుగు వారికి పండగలు మొదలవుతాయి. నెలకు రెండు చొప్పున సంవత్సరం పొడవునా వచ్చే 24 ఏకాదశులలో తొలి ఏకాదశికి ఆధ్యాత్మికంగానూ, వైజ్ఞానికంగానూ ఎంతో విశిష్ట స్థానం ఉంది. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం.. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు పాలకడలిలో శేషతల్పంపై యోగనిద్రలోకి వెళ్తాడని భక్తులు నమ్ముతారు. స్వామివారు యోగనిద్రలో గడిపే ఈ నాలుగు నెలల కాలాన్ని 'చాతుర్మాస వ్రతం' అని పిలుస్తారు. తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామివారు నిద్రలేస్తారని చెబుతారు. ఈ నాలుగు నెలల కాలంలో భక్తులు జపాలు, ధ్యానాలు, ఉపవాసాలు ఆచరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు. ఈ రోజున చేసే విష్ణు పూజ, జప తపాలు, దానధర్మాలు సమస్త పాపాలను ప్రక్షాళన చేసి మోక్షాన్ని ప్రసాదిస్తాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.

పేలాల పిండి ప్రసాదం.. ఆధ్యాతికం, ఆరోగ్యం

ఈ పండుగ రోజున భక్తులు ఆచరించే ప్రధానమైన ఆచారం 'పేలాల పిండి' ప్రసాదం నివేదన. జొన్న పేలాలను బెల్లం, యాలకులు, మిరియాల పొడితో కలిపి దంచి శ్రీమహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ఆధ్యాత్మిక భావనతో పాటు అత్యంత శక్తివంతమైన ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. ఆషాఢ మాసంలో వర్షాలు ప్రారంభమై వాతావరణం చల్లబడుతుంది. ఈ కాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి జీర్ణవ్యవస్థ బలహీనపడటం, జలుబు, జ్వరం వంటి రుగ్మతలు రావడం సాధారణం. జొన్న పేలాలు జీర్ణక్రియను వేగవంతం చేయగా, బెల్లం శరీరానికి తక్షణ శక్తిని, ఐరన్‌ను అందిస్తుంది. మిరియాలు శరీరంలో వేడిని పెంచి కఫం, జలుబు వంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇలా మన ఆచారాల వెనుక పూర్వీకులు గొప్ప ఆరోగ్య సూత్రాలను ముడిపెట్టారు.

రైతన్నల తొలి పండగ

అలాగే, గ్రామాల్లో తొలి ఏకాదశిని రైతులు తమ తొలి పండుగగా, వ్యవసాయ పనుల ప్రారంభానికి శుభసూచకంగా భావిస్తారు. వర్షాకాలం ఆరంభమయ్యే ఈ సమయంలో నేల తల్లికి, విష్ణుమూర్తికి పూజలు చేసి ఏరువాక సాగిస్తారు. పంటలు సమృద్ధిగా పండి, పాడిపంటలతో ఇల్లు తులసిపోవాలని భగవంతుడిని ప్రార్థిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి సమయాల్లో జాగరణ చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణలు, భజనలతో కాలక్షేపం చేస్తారు. ఈ విధంగా ఆధ్యాత్మిక నిష్ఠను, శారీరక ఆరోగ్యాన్ని, ప్రకృతితో మానవునికి ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే అద్భుతమైన పండగే తొలి ఏకాదశి.

Next Story