అది బైకా..! పుష్పక విమానమా?

by Muthe.Rajitha |

సాధారణంగా ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనంపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి.

అది బైకా..! పుష్పక విమానమా?
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనంపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి. అలా కాకుండా ముగ్గురు ప్రయాణిస్తే 'ట్రిపుల్ రైడింగ్' అని పోలీసులు ఆపి చలానా చేతిలో పెడతారు. అలాంటిది, బైక్ మీద ఏకంగా ఆరుగురు ప్రయాణిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ప్రయాణించడమే కాదు వాయు వేగంతో దూసుకు వెళుతూ ఫీట్లు చేస్తే ఇంకెలా ఉంటుంది? అచ్ఛం ఇలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో ఏకంగా ఆరుగురు యువకులు ఒకే బైక్‌పై సర్కస్ ఫీట్లలా ప్రయాణిస్తూ.. మితిమీరిన వేగంతో దూసుకుపోతూ ట్రాఫిక్ పోలీసుల కంట్లో పడ్డారు. పోలీసులు సినిమాటిక్ లెవెల్ లో ఛేజ్ చేసి వారిని పట్టుకొని, గట్టిగా బుద్ధి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం చిలమత్తూరులో హిందూపురం రూరల్ సీఐ జనార్దన్, ఎస్సై శ్రీధర్ తమ సిబ్బందితో కలిసి రోటీన్ వాహన తనిఖీలు చేస్తున్నారు.

అదే సమయంలో ఒకే ద్విచక్ర వాహనంపై ఆరుగురు యువకులు వాయు వేగంతో రావడం చూసి పోలీసులే షాకయ్యారు. వారిని ఆపేందుకు యత్నించగా, ఆ యువకులు ఎస్కేప్ అయ్యేందుకు ట్రై చేశారు. అయితే పోలీసులు వెంబడించి మరీ వారిని అదుపులోకి తీసుకున్నారు.స్టేషన్‌కు తరలించి ఆ యువకులకు గట్టిగానే క్లాస్ పీకారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించి ఇలాంటి పిచ్చి స్టంట్ల వల్ల ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తూ, రోడ్డు భద్రతపై కౌన్సెలింగ్ ఇచ్చారు.

Next Story