ఖతార్‌లో భారత రాయబారిగా తెలంగాణ వ్యక్తి

by Muthe.Rajitha |

ఖతార్‌లో నూతన భారత రాయబారిగా తెలంగాణకు చెందిన వ్యక్తి నియమితులయ్యారు.

ఖతార్‌లో భారత రాయబారిగా తెలంగాణ వ్యక్తి
X

దిశ, వెబ్ డెస్క్ : ఖతార్‌లో నూతన భారత రాయబారిగా తెలంగాణకు చెందిన వ్యక్తి నియమితులయ్యారు. సీనియర్ దౌత్యవేత్త డాక్టర్ కె. శ్రీకర్ రెడ్డిని ఖతార్‌ నూతన భారత రాయబారిగా నియమిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ (MEA) అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2001 ఐఎఫ్ఎస్ (IFS) బ్యాచ్‌కు చెందిన శ్రీకర్ రెడ్డి, ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్‌గా సేవలందిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీకర్ రెడ్డి విద్యాభ్యాసం అంతా ఇక్కడే సాగింది. వరంగల్‌లోని ప్రముఖ కాకతీయ వైద్య కళాశాల (KMC) నుంచి ఆయన ఎంబీబీఎస్ (MBBS) డిగ్రీని పూర్తి చేశారు. వైద్య విద్య అనంతరం ఇండియన్ ఫారిన్ సర్వీస్‌కు ఎంపికైన ఆయన దౌత్యరంగంలో పలు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. గతంలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిగా (RPO) కూడా విశేష సేవలందించిన శ్రీకర్ రెడ్డి, ఇప్పుడు ఖతార్‌ వంటి కీలక గల్ఫ్ దేశంలో భారత రాయబారిగా నియామకం కావడం తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది.

Next Story