కామన్వెల్త్ గేమ్స్.. దేశానికి తొలి పతకం

by Muthe.Rajitha |   (  Updated:2026-07-24 23:12:15  IST  )

2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games 2026) మొదటి రోజు భారత క్రీడాకారులు విశేష ప్రతిభను కనబరిచారు.

కామన్వెల్త్ గేమ్స్.. దేశానికి తొలి పతకం
X

దిశ, వెబ్ డెస్క్ : 2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games 2026) మొదటి రోజు భారత క్రీడాకారులు విశేష ప్రతిభను కనబరిచారు. పురుషుల హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్‌ విభాగంలో ఝండూ కుమార్ కాంస్య పతకం (Bronze) సాధించడంతో పతకాల పట్టికలో భారత్ తన ఖాతాను తెరిచింది. 72 కేజీల హెవీ వెయిట్ విభాగంలో ఝండూ కుమార్ మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకోగా, నైజీరియాకు చెందిన రీలువన్ బంగారు పతకం, ఇంగ్లండ్ కు చెందిన మాథ్యూ వెండి పతకం గెలిచారు. కాగ దేశానికి తొలి పతకాన్ని అందించిన ఝండూ కుమార్ ప్రస్థానం ఎంతో స్పూర్తిమంతమైంది. బీహార్‌లోని నలంద జిల్లా హర్నౌత్‌కు చెందిన ఈయన ఒక పేద కూరగాయల వ్యాపారి కుమారుడు. చిన్నతనంలోనే పోలియో బారిన పడిన ఝండూ కుమార్, 2017లో పారా అథ్లెటిక్స్ లో షాట్‌పుట్, డిస్కస్ త్రో ద్వారా తన క్రీడా జీవితాన్ని ప్రారంభించారు. జిమ్‌లో శిక్షణ పొందే సమయంలో పవర్‌లిఫ్టింగ్ వైపు ఆకర్షితుడైన ఆయన, జాతీయ స్థాయిలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ, పారాలింపిక్ కాంస్య పతక విజేత రాజిందర్ సింగ్ రహేలూ దృష్టిలో పడ్డారు. ఆయన మార్గదర్శకత్వంలో గాంధీనగర్‌లోని శాయ్ (SAI) కేంద్రంలో కఠిన శిక్షణ పొంది, 2025లో 205 కేజీల భారమెత్తి జాతీయ రికార్డు సృష్టించారు.

ఆ తర్వాత బీజింగ్ వరల్డ్ కప్ 2025, ఆసియన్ & ఓషియానియా ఛాంపియన్‌షిప్స్ 2026లలో కాంస్య పతకాలు సాధించి కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించారు. పతకం సాధించిన సందర్భంగా ఝండూ కుమార్ మాట్లాడుతూ.. ఇక్కడితో అయిపోలేదని తదుపరి లక్ష్యం లాస్ ఏంజెల్స్ 2028 పారాలింపిక్స్ (LA28)లో భారతదేశానికి పతకం బంగారు పతకం సాధించడమేనని అన్నారు. మరోవైపు బాక్సింగ్ పురుషుల 55 కేజీల విభాగంలో జాదుమణి సింగ్ అద్భుత విజయాన్ని సాధించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించగా, ల్యాన్ బౌల్స్ (Bowls) విభాగంలో పుతుల్ సోనోవాల్, రూపారాణి తిర్కీ, పింకీ సింగ్‌లు తమ విభాగాల్లో వరుస విజయాలతో పూల్ దశలో అగ్రస్థానంలో నిలిచారు. ఈత పోటీల్లో ఒలింపియన్ శ్రీహరి నటరాజ్ 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ సెమీఫైనల్‌కు చేరుకున్నారు.

Next Story