‘సర్’.. సమస్యలు!

by Jakkula.Mamatha |

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్)ఓటర్లలో గందరగోళానికి దారితీస్తోంది.

‘సర్’.. సమస్యలు!
X

దిశ, వరంగల్ బ్యూరో: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్)ఓటర్లలో గందరగోళానికి దారితీస్తోంది. ఓటరు సవరణలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు అందరికీ పంపిణీ చేసిన బీఎల్‌వోలు డిజిటలైజేషన్ సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. పాత ఓటర్ల జాబితా కోసం తిప్పలు పడుతున్నారు. మహిళలు, ముఖ్యంగా కోడళ్లుగా ఇతర ఇళ్లకు వెళ్లిన వారు వారి తల్లిదండ్రుల వివరాల ఎంట్రీ సమయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సర్ కు సంబంధించి 2002 ఓటరు జాబితాలో పూర్తి వివరాలు లేకపోవడం కొంతమంది తల్లిదండ్రులు చనిపోవడంతో వివరాలు దొరకక డిజిటలైజేషన్ ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఇంకా పది రోజులే సమయం ఉండటంతో ఉరుకులు పరుగుల మీద బీఎల్వోలు బీఎల్ఏలతో కలిసి డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇంటింటికి బీఎల్ఓలు..

ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ జూన్ 25న మొదలైంది. బీఎల్​ఓలు ఇంటింటికి తిరగడంతో పాటు పోలింగ్ స్టేషన్ల వారీగా ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్​పూర్, జనగామ, పాలకుర్తి, వర్ధన్నపేట, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. ఆరు జిల్లాల పరిధిలో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. హన్మకొండ జిల్లా పరిధిలో 5లక్షల 9వేల 14 మంది ఓటర్లు, వరంగల్ జిల్లా పరిధిలో 7లక్షల 76 వేల 953 ఓటర్లు, జనగామ జిల్లా పరిధిలో 7లక్షల 87వేల 483 ఓటర్లు, మహబూబాబాద్ జిల్లా పరిధిలో 4లక్షల 84వేల 932 ఓటర్లు, భూపాలపల్లి జిల్లా పరిధిలో 2లక్షల 77వేల 882 ఓటర్లు, ములుగు జిల్లా పరిధిలో 2లక్షల 38 వేల 970 మంది ఓటర్లు ఉన్నారు.

వీరందరికి మొదట బీఎల్​ఓలు ఇండ్లను గుర్తించడంతో పాటు ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్ఏలతో కలిసి అందజేశారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత డిజిటలైజేషన్ ప్రక్రియ మొదలు కాగానే అసలు సమస్యలు మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 30 లక్షల 53వేల 938 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 15 లక్షల వరకు డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. మిగతా వారి ప్రక్రియను బీఎల్ఓలు, సూపర్ వైజర్లు, బీఎల్ఏల ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. నిత్యం జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు పోలింగ్ బూత్ ల వారీగా పర్యటిస్తూ ఎక్కడైతే ఆలస్యం జరుగుతుందో అక్కడ బీఎల్ఓలకు అసిస్టెంట్లను నియమిస్తూ త్వరగా ప్రక్రియ పూర్తయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పోలింగ్ బూత్ ల పరిధిలో గ్రామాల వారీగా సమీక్షిస్తూనే త్వరగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

డిజిటలైజేషన్​లో సమస్యలు..

డిజిటలైజేషన్ ప్రక్రియలో లింక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. పురుష ఓటర్లకు సంబంధించి ఎక్కువ సమస్యలు రాకున్నా మహిళా ఓటర్లకు సంబంధించి సమస్యలు ఏర్పడుతున్నాయి. పెళ్లిళ్ల తర్వాత మహిళా ఓటర్లు వేరే గ్రామాలకు, వేరే జిల్లాలకు, వేరే రాష్ట్రాలకు వెళ్లారు. అత్తగారింటికి పోయిన మహిళా ఓటర్లు వారి వివరాలను అందించే సమయంలో సమస్యలు అత్యధికంగా వస్తున్నాయి. మహిళలకు సంబంధించి తల్లిదండ్రుల వివరాలను అందించాలని కోరారు. వాటితో పాటు 2002 ఓటరు జాబితాలో వారి పేర్లు ఉన్నాయా వాటి వివరాలను కూడా పొందుపరచాలని కోరారు. కొంత మందికి వివరాలు అందుబాటులో ఉన్న మిగతా వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. వారి తల్లిదండ్రులు చనిపోవడం కొంత మందికి ఓటర్లలో పేరు లేకపోవడంతో పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ జరగడం లేదు. కుటుంబంలో పురుష ఓటర్లకు సంబంధించిన ఇబ్బందులు రావడం లేదు. మహిళలకు సంబంధించి పెళ్లికాని యువతులకు ఇబ్బందులు లేవు. తల్లిదండ్రుల వివరాలతో పాటు వారి వివరాలను అందిస్తున్నా పెళ్లి తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికే సమస్యలు వస్తున్నాయి. కొంత మందికి పేర్లకు సంబంధించిన తంటాలు వస్తున్నాయి. ఎపిక్ కార్డులో పేర్లు తప్పుగా నమోదు కావడం, ఇంటి పేర్లు తేడాలు ఉండడం, తప్పులు ఉండటంతో వివరాల నమోదుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.

ముఖ్యంగా వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల పరిధిలో సమస్యలు ఎదురవుతున్నాయి. వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని పోలింగ్ బూత్ లకు అనుగుణంగా ఎన్యుమరేషన్ ఫారాలను సరఫరా చేసిన బీఎల్ఓలు వెళ్లిన సమయంలో వారు లేకపోవడం, ఉద్యోగరిత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లడం, తాళం వేసి ఉండటంతో డిజిటలైజేషన్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. ఇదే కాకుండా ఉద్యోగులు ఉదయం, సాయంత్రం వేళ్లల్లోనే అందుబాటులో ఉండటం ఆ సమయంలోనే బీఎల్ఓలు వెళ్లడం సమస్యలు ఎదురవుతున్నాయి.

కొన్ని మున్సిపాలిటీల పరిధిలోనూ డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరగడం లేదు. కొన్ని పోలింగ్ బూత్ ల పరిధిలో బీఎల్ఓలు వేగంగా డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నా మరిన్ని పోలింగ్ బూత్ ల పరిధిలో మాత్రం వెనుకబడి ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో పరిశీలించడంతో పాటు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకు పోతున్నారు. బీఎల్ఓలు, బీఎల్ఏల ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొన్నిచోట్ల వెనుకబడి ఉండటం కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు త్వరగా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా పది రోజులే సమయం ఉండటంతో ఆలోపు మిగిలిన ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Next Story