ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ‘పెదకాపు’ హీరోయిన్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

పెద్దలను ఒప్పించి తాజాగా, ఈ జంట మరో అడుగు ముందుకేసి ఎంతో వైభవంగా నిశ్చితార్థం చేసుకున్నారు.

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ‘పెదకాపు’ హీరోయిన్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: తమిళ వెబ్ సిరీస్ ‘ఆహా కళ్యాణం’లో పవి టీచర్‌గా నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న నటి బ్రిగిడా సాగా..నటనపై ఉన్న ఆసక్తితో ‘అయోగ్య’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత మాస్టర్, ఇరవిన్ నిళల్, మార్గన్, గరుడన్ వంటి సినిమాల్లో విభిన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను మైమరిపించారు. ఇక ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇడ్లీ కడై’ చిత్రంలోనూ ఒక కీలక పాత్రలో మెరిసి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ సింధూరం, పెదకాపు వంటి సినిమాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇక బ్రిగిడా వ్యక్తిగత జీవితానికి వస్తే.. గత కొద్ది కాలంగా నటుడితో ప్రేమలో ఉన్న ఆమె ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారు. ఇటీవల తమిళ నటుడు అనంత్ రామ్‌తో తాను ప్రేమలో ఉన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసింది. పెద్దలను ఒప్పించి తాజాగా, ఈ జంట మరో అడుగు ముందుకేసి ఎంతో వైభవంగా నిశ్చితార్థం చేసుకున్నారు.

ఈ వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోలను బ్రిగిడా సాగా తన సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తమ జీవితంలోనే ఇది అత్యంత సులభమైన నిర్ణయమని ఆమె పేర్కొన్నారు. కొన్నిసార్లు గొప్ప ప్రేమ కథలు ఎటువంటి పెద్ద ప్రణాళికలతో ప్రారంభం కావని, ప్రతిరోజూ ఒకరినొకరు ఇష్టపూర్వకంగా ఎంచుకునే ఇద్దరు వ్యక్తులతోనే మొదలవుతాయని అన్నారు. తమ రెండు కుటుంబాల ఆశీస్సులతో, తమను పెంచి పెద్ద చేసిన ఇళ్లకు, తమను కలిపిన ప్రేమకు గౌరవంగా రెండు సంప్రదాయాల ప్రకారం ఈ నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నట్లు బ్రిగిడా తెలిపారు. తమ ప్రయాణాన్ని ఇంత ఆప్యాయతతో స్వీకరించి, శుభాకాంక్షలు తెలిపిన అభిమానులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడి నుంచే తమ శాశ్వత బంధంతో పాటు సరికొత్త ప్రేమ ప్రయాణం మొదలవుతుందని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం బ్రిగిడా, అనంత్ రామ్ నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఈ కొత్త జంటకు పెద్ద శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story