విశాఖ బీచ్‌లో తెలంగాణ యువతి ఆత్మహత్యాయత్నం

by Muthe.Rajitha |

విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డులో ఓ యువతి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది.

విశాఖ బీచ్‌లో తెలంగాణ యువతి ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డులో ఓ యువతి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. బాధితురాలిని తెలంగాణ ప్రాంతానికి చెందిన లావణ్యప్రియగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బీచ్ రోడ్డులో సదరు యువతి ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై కుమ్మరించుకుని నిప్పు అంటించుకుంది. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ రోడ్డుపైకి పరుగెత్తింది. ఇది గమనించిన స్థానికులు, అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి మంటలను అదుపు చేశారు. అయితే, ఈ ప్రమాదంలో యువతి చేతులు, ముఖం, తల భాగం తీవ్రంగా కాలిపోయాయని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రురాలిని వెంటనే నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి అయిన కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న విశాఖపట్నం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆమె తెలంగాణ నుండి విశాఖకు ఎందుకు వచ్చింది? అంతటి దారుణ నిర్ణయం తీసుకోవడానికి గల కుటుంబ లేదా వ్యక్తిగత కారణాలు ఏంటి? ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story